ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతూ...
ఎప్పుడైనా ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, ఆ సమయంలో మనకు ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తుంది. సమయం గడవక, సమస్యకు పరిష్కారం దొరకక, మానసికంగా ఎంతో బాధపడవచ్చు. కానీ ఒకసారి ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాక, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే... రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయో అనిపిస్తుంది. ఒకప్పుడు అనుభవించిన ఆ మానసిక బాధ కూడా అంతగా గుర్తుండదు. 2022 జూన్ 24, శుక్రవారం సాయంత్రం... సరిగ్గా ఐదున్నర సంవత్సరాలు ఎస్‌బీఐ తిరుత్తణి మెయిన్ బ్రాంచ్‌లో పనిచేసిన తర్వాత, ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురుచూస్తున్న ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్ చివరకు నాకు వచ్చింది. ఆ రోజు రిలీవ్ అయి తిరుపతికి వచ్చేశాను. ఆ తర్వాత వారం రోజులకు... 2022 జూలై 2, శనివారం... సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈ రోజే నేను తిరుపతిలోని మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో రిపోర్ట్ చేశాను. కొత్త బ్రాంచ్... కొత్త మనుషులు... అంతకు ముందు నాకు అక్కడ ఎవరూ పరిచయం లేదు. అందుకే చాలా భయంగా, కొత్త వాతావరణంపై ఒక తెలియని ఆందోళనగా అనిపించింది. అయితే, ఆ సమయంలో మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో లోకల్ సెక్రటరీగా శ్రీనివాస్ ఉండటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి...