నా జీవితం, నా నిర్ణయాలు — పెళ్లి విషయంలో నా ఆలోచనలు
మూడు రోజుల వరుస సెలవుల్లో ఈ రోజు ఒకటి పూర్తైంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నాను. తినడం, YouTube చూడడం, నిద్రపోవడం — ఇలా రోజంతా గడిచిపోయింది.
ప్రతి శుక్రవారం బ్యాంక్ అవ్వగానే సాయంత్రం నేరుగా KT రోడ్‌లో ఉన్న భాటా షోరూమ్ కింద ఉన్న సాగర్ అన్న సలూన్‌కి వెళ్లడం నాకు అలవాటు. ఈరోజూ సాయంత్రం ఐదు గంటల తర్వాత అక్కడికి వెళ్లాను.
రాత్రి ఏడు నరకి ఇంటికి వచ్చి ఇడ్లీ తిని, మళ్లీ ఫోన్‌లో YouTube చూడడం ప్రారంభించాను.
అప్పుడే ఒక వ్యక్తి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. పేరు చూసిన వెంటనే — ఏ విషయం గురించి మాట్లాడతారో నాకు అర్థమైంది. ఆ విషయం గురించి మాట్లాడాలనే ఆసక్తి నాకు లేకపోయినా, కాల్ లిఫ్ట్ చేశాను.
మొదట రెండు నిమిషాలు సాధారణంగా మాట్లాడాం. ఆ తర్వాత అసలు విషయం మొదలైంది.
నాకు కాల్ చేసిన వ్యక్తి — “నీకు పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉందా లేదా?” అని అడిగాడు.
ఎవరైనా నా పెళ్లి విషయం ప్రస్తావించగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది; వెంటనే నాకు అసహనం, కోపం, తెలియని భయం, ఆందోళన మొదలవుతాయి.
ఈరోజూ కూడా అదే జరిగింది. పెళ్లి విషయం ప్రస్తావించగానే నా లోపల అలాంటి మార్పులు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఇలా నాకు
జరుగుతుందో నాకు బాగా తెలుసు. కానీ నేను ఎంత చెప్పినా ఎవరూ దాన్ని అర్థం చేసుకోలేరు. “ఇది ఒకరకమైన మానసిక సమస్య అని నాకు బాగా తెలుసు.”
నాకు కాల్ చేసిన వ్యక్తి నన్ను ఒప్పించడానికి రెండు మూడు సార్లు ప్రయత్నించారు. నేను చెప్పిన ప్రతి విషయాన్ని విని — దాంట్లో ఏమి సరైంది, ఏమి తప్పు అన్నది వివరించి, “ఇలా ఉంటే ఎలా?” అని అడిగారు. ఆ మాటలు నాకు మరింత టెన్షన్ తెచ్చాయి.
మాటల మధ్యలో నా తల్లిదండ్రుల గురించి కూడా చర్చ వచ్చింది. నేను ఇప్పటికీ పెళ్లి విషయంపై ముందుకు వెళ్లకుండా ఉండటానికి ప్రధాన కారణం వాళ్లే అని చెప్పాను.
ఆ తర్వాత ఆయన ఒక ప్రశ్న అడిగారు:
“నువ్వు 9 సంవత్సరాలుగా బ్యాంకులో పని చేస్తున్నావు. బ్లాగులు రాస్తున్నావు. అయినా నీ మీద ఎవరికీ ఆసక్తి రాలేదా?”
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే చాలా కథలు చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ జనరేషన్‌లో చాలా విషయాలు కమర్షియల్ అయిపోయాయి. నిజమైన ఆప్యాయతతో ఎవరు ముందుకు రావడం లేదు అని ఆయనకి చెప్పాను.
మరొక ముఖ్యమైన విషయం — నాకు పిల్లలు అంటే అసలు ఇష్టం లేదు. అందుకే నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదు అని స్పష్టంగా చెప్పాను.
అప్పుడు ఆయన — “పిల్లలు వద్దని అనుకుంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు” అన్నారు.
అది నిజమే అని నాకు తెలుసు. అందుకే నేను కూడా పెళ్లి విషయంలో ఎలాంటి ముందడుగు వేయడం లేదు అని చెప్పాను.
బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాల్లో DINK (Dual Income No Kids) అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తోంది. కానీ Tier-2, Tier-3 నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. పెళ్లి అంటే తప్పనిసరిగా పిల్లలు అనే భావన ఇంకా బలంగా ఉంది. లేకపోతే మహిళను మానసికంగా ఈ సమాజం బాధించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ పరిస్థితి మారాలని నా గాఢమైన కోరిక.
“పెళ్లి చేసుకో, పిల్లలు కనాలి” అని ఒత్తిడి చేసే వారు — వాళ్ల వ్యక్తిగత జీవితంలో నిజంగా సంతోషంగా ఉన్నారా? తెలియదు. అయినా ఎందుకు ఇతరులకు అదే సలహా ఇస్తారో అర్థం కావడం లేదు.
నిజం చెప్పాలంటే, ఈ రోజుల్లో అత్యంత ఖరీదైన విషయం ఏదైనా ఉందంటే — అది పిల్లలే.
“Nowadays, children are the most expensive product.”
పుట్టినప్పటి నుంచి పెంచడం వరకు ఎంత ఖర్చు, ఎంత బాధ్యత — మీ అందరికీ తెలుసు.
20–30 సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.
నా అభిప్రాయం ఏమిటంటే — ఈ భూమిపై ఒక బిడ్డ పుట్టాలి అంటే, ఆ బిడ్డ తల్లిదండ్రులు ముందుగా తమ ఆర్థిక స్థితి, బాధ్యతలను నిజంగా ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు వాళ్ల చేతుల్లోనే ఉంటుంది.
లేకపోతే, ఆ పిల్లలు జీవితాంతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మొత్తానికి, నాకు ఉన్న ఒకే ఒక్క నమ్మకం — ఇంకా నాకు SBI లో 24 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉంది. నేను తిరుపతిలోనే ఉంటాను. నా ఆరోగ్య పరిస్థితులు, అలాగే నాకు పిల్లలు అంటే ఇష్టం లేకపోవడం వల్ల —
ప్రస్తుతం నాకు 36 సంవత్సరాలు వచ్చినా కూడా, నేను ఇంకా పెళ్లి గురించి సీరియస్‌గా ఆలోచించడం లేదు.
ఈ విషయాన్ని కాల్ చేసిన వ్యక్తికి స్పష్టంగా చెప్పి — కాల్ కట్ చేశాను.
---
తిరుపతి మహేష్
27/03/2026
Comments
Post a Comment