ఒక తండ్రి మనసు…
ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 9:30కి రెడీ అయి, బ్యాంక్‌కు వెళ్లడానికి Rapidoలో రైడ్ బుక్ చేస్తాను. సాధారణంగా 1–2 నిమిషాల్లో ఎవరో ఒకరు రైడ్ అక్సెప్ట్ చేసి, నన్ను పిక్ చేయడానికి వస్తారు.
కెప్టెన్ 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు, నేను నా బ్యాగ్ తీసుకుని, మొదటి ఫ్లోర్‌లో ఉన్న మా ఫ్లాట్ నుంచి మెట్లు దిగి అపార్ట్‌మెంట్ పార్కింగ్ ఏరియాకి వస్తాను. చాలా సార్లు అమ్మ నాతో పాటు వచ్చి నన్ను బైక్ ఎక్కిస్తారు. కానీ ఆమె ఎప్పుడైనా బయటికి వెళ్లి ఉంటే, నేను స్వయంగా డోర్ లాక్ చేసి కిందకి వచ్చి వేచి ఉంటాను.
కెప్టెన్ ఫోన్ చేస్తే,
“లోపలకి రండి… B బ్లాక్ లిఫ్ట్ దగ్గర ఉన్నాను… నాకు కనిపించదు” అని చెబుతాను.
---
ఈరోజు సోమవారం.
ఉదయం లేచేసరికి 8:30 దాటిపోయింది. బ్యాంక్‌కి వెళ్లాలనే ఆసక్తి కూడా అంతగా అనిపించలేదు. నిన్న ఆదివారం ఒక్కరోజు సెలవు సరిపోలేదేమో అనిపించింది.
ఎలాగోలా రెడీ అయి, 9:30కి రైడ్ బుక్ చేశాను. కానీ చాలా రోజుల తర్వాత రెండు రైడ్లు క్యాన్సిల్ అయ్యాయి. మూడో రైడ్ అక్సెప్ట్ అయ్యేసరికి సమయం 9:50 అయింది.
సాధారణంగా రైడ్ మొదలైన వెంటనే, నేను కెప్టెన్‌కి దారి చెబుతాను. ఎందుకంటే ప్రతిరోజూ ఒకే రూట్‌లో వెళ్తూ, ఏది షార్ట్‌కట్, ఏది బెస్ట్ అనేది నాకు బాగా తెలుసు.
Google Maps చూపించే దారి కంటే, నాకు తెలిసిన దారినే వెళ్లమని చెబుతాను.
ఈ చిన్న సంభాషణల ద్వారానే, ఆ వ్యక్తితో ఇంకా మాట్లాడాలా లేదా అనేది నేను నిర్ణయించుకుంటాను.
ఈరోజు మొదట్లో మాట్లాడాలని అనిపించలేదు.
కానీ అకస్మాత్తుగా నేను అడిగాను:
“మీరు ఫుల్ టైమ్ Rapidoనా? లేక పార్ట్ టైమ్?”
ఆయన చెప్పారు:
“ఫుల్ టైమ్ సర్… మూడు సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాను.”
అప్పుడు నేను అడిగాను:
“ఎలక్ట్రిక్ బైక్ ఎందుకు కొనలేదు? పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది కదా?”
ఆయన చెప్పిన సమాధానం చాలా ప్రాక్టికల్‌గా అనిపించింది.
“రోజుకు కనీసం 150 కిలోమీటర్లు తిరుగుతాను సర్…
ఎలక్ట్రిక్ బైక్ అయితే 100 కిలోమీటర్ల తర్వాత ఛార్జింగ్ పెట్టాలి…
దానికి 4–5 గంటలు పడుతుంది…
ఆ టైమ్ అంతా నా పని ఆగిపోతుంది.”
అదే తన ప్లాటినా బైక్ అయితే, లీటర్‌కు 60 కిలోమీటర్లు ఇస్తుంది.
₹250 పెట్రోల్‌తో రోజంతా పని సాగిపోతుంది.
ఇప్పటివరకు 18,000 కంటే ఎక్కువ రైడ్లు చేశానని చెప్పాడు.
తన Rapido అనుభవాల గురించి చెబుతూ…
మూడు సంవత్సరాల క్రితం తిరుపతిలో Rapido గురించి ఏమీ తెలియకపోయినా, ఒకరోజు అలా రైడ్ అక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గరకు వెళ్లాడట.
అతన్ని చూసిన వెంటనే,
“మీరు Rapidoకి కొత్తలా ఉన్నారు?” అని కస్టమర్ అడిగాడట.
అప్పుడు అతను,
“అవును సర్… ఇది నా ఫస్ట్ రైడ్” అని చెప్పాడట.
రైడ్ ముగిసేసరికి ₹33 ఫేర్ వచ్చింది.
కానీ కస్టమర్ ₹50 ఇచ్చి,
“All the best” అని చెప్పాడట.
ఆ చిన్న ప్రోత్సాహం… ఇప్పటికీ తనకు గుర్తుందని చెప్పాడు.
తర్వాత నేను అతని కుటుంబం గురించి అడిగాను.
తనకి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాడు.
పెద్దవాడు డిప్లొమా చేస్తున్నాడు.
చిన్నవాడు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
పెద్దవాడి గురించి చెబుతూ,
అతనికి చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్య ఉందని చెప్పాడు.
అందువల్లనే SV Polytechnic Collegeలో Civil Engineeringలో చేర్చానని చెప్పారు.
నాకు ఒక సందేహం వచ్చింది.
“హెల్త్ ఇష్యూ ఉందన్నారు… అయితే సివిల్ ఇంజినీరింగ్ ఎందుకు? CSE లో చేర్చితే బాగుండదా?” అని అడిగాను.
అప్పుడు ఆయన చెప్పారు:
“చిన్నప్పటి నుంచి అతనికి ఫిట్స్ వస్తుంటాయి సర్…
ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు…
CSE అంటే మైండ్ మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది…”
“సివిల్ ఇంజినీరింగ్ చేసి, AutoCAD నేర్చుకుంటే కంప్యూటర్ మీద డ్రాయింగ్ చేసుకుంటూ, స్ట్రెస్ లేకుండా పని చేసుకోవచ్చు సర్…” అన్నారు.
ఆ మాట విన్నాక…
తన పిల్లాడి పరిస్థితిని అర్థం చేసుకుని…
అతనికి సరిపోయే దారిని ఎంచి పెట్టడం…
అది నాకు నిజంగా చాలా గొప్పగా అనిపించింది.
“ఎంతమంది తల్లిదండ్రులు ఇలా సరైన విధంగా ఆలోచిస్తారు?”
అనే ప్రశ్న నాలో నిశ్శబ్దంగా మోగింది.
అదే సమయంలో…
నా పరిస్థితిని, నా అవసరాలను…
నాకు ఉన్న సమస్యలను గురించి
నా తల్లిదండ్రులు అలా లోతుగా ఆలోచించకుండా,
వారి ఆలోచనల ప్రకారం, వారి ఇష్టానుసారం ఇప్పటికీ వ్యవహరిస్తూనే ఉన్నారని గుర్తుకు వచ్చి,
మనసు కొద్దిగా బాధపడ్డది.
అంతలోనే బ్యాంక్ వచ్చేసింది.
---
తిరుపతి మహేష్
06/04/2026
Comments
Post a Comment