ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం
చాలా రోజులుగా చూడాలని అనుకుంటూ ఉన్న Love Today సినిమాను నిన్న రాత్రి భోజనం అయ్యాక laptop లో చూడటం ప్రారంభించాను.
గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి విడుదలవుతున్న కొత్త సినిమాలను “ఆడియో డిస్క్రిప్షన్” సహాయంతో చూస్తున్నాను. దీని వల్ల సినిమా మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా ఫీల్ అవుతూ, కథతో బాగా కనెక్ట్ అవుతూ చూడగలుగుతున్నాను.
పక్కన ఉన్న వాళ్లపై ఆధారపడకుండా, ఆడియో డిస్క్రిప్షన్‌తో సినిమా చూస్తూ ఉండటం వల్ల కలిగే ఆనందం — ఒక సినిమా చూసిన సంతృప్తి — మాటల్లో చెప్పలేనిది.
ఆడియో డిస్క్రిప్షన్ అంటే కేవలం స్క్రీన్‌పై ఏమి జరుగుతుందో వినడం మాత్రమే కాదు; ప్రతి సీన్‌లో పాత్రల భావోద్వేగాలు, ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ, ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా సినిమా ఆస్వాదించడం. అది నిజంగా వర్ణించలేని అనుభూతి.
చిన్నప్పటి నుంచే నాకు సినిమాలు చూడటం చాలా ఇష్టం. కానీ ఏడాది క్రితం వరకు “ఆడియో డిస్క్రిప్షన్” అనే కాన్సెప్ట్ ఆచరణలో లేకపోవడంతో, అంతకుముందు సినిమాలు చూస్తున్నప్పుడు ఏదైనా సీన్ అర్థం కాకపోతే, పక్కన ఉన్న వాళ్లను అడిగి తెలుసుకునేవాడిని.
ఇప్పుడు ఆడియో డిస్క్రిప్షన్ అందుబాటులోకి రావడంతో, ఎవరో ఒకరు నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తే ఎంత హాయిగా ఉంటుందో, అలాంటి సంతోషం కలుగుతోంది.
అయితే, ఒకసారి ఆడియో డిస్క్రిప్షన్‌కు అలవాటు పడిన తర్వాత, అది లేని కొత్త సినిమాలు చూడటం కొంచెం కష్టంగా అనిపిస్తోంది.
ఇటీవల సుప్రీంకోర్టు ఇకపై విడుదలయ్యే అన్ని సినిమాలకు ఆడియో డిస్క్రిప్షన్ తప్పనిసరి చేయాలని తీర్పు ఇచ్చిందని విన్నాను. అది నిజంగా అమలైతే, మాలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది.
---
ఇక Love Today సినిమా విషయానికి వస్తే — అందరూ బాగుందని చెప్పినా, నాకు ఇన్ని రోజులు చూడాలని అనిపించలేదు. చివరికి నిన్న రాత్రి చూసాను.
2022 నవంబర్‌లో విడుదలైన ఈ సినిమాను నేను చాలా ఆలస్యంగా చూశాననిపించింది. నిజంగా అప్పుడే చూసి ఉండాల్సింది అనిపించింది.
సినిమా చాలా బాగుంది. చాలా చోట్ల బాగా నవ్వుకున్నాను. సినిమాలోని పాత్రల భావోద్వేగాలతో చాలా సులభంగా కనెక్ట్ అయ్యాను.
మొత్తానికి, ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా Love Today నాకు చాలా నచ్చింది.
ఇప్పటికే ఆయన హీరోగా నటించిన Dragon మరియు Dude సినిమాలు కూడా చూసాను.
కుదిరితే, మొన్న శుక్రవారం విడుదలైన ప్రదీప్ రంగనాథన్ నాలుగో సినిమా Love Insurance Kompany ను, నయనతార నిర్మాణంలో, విఘ్నేష్ శివన్ రచన మరియు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈరోజు థియేటర్‌లో చూడాలని అనుకుంటున్నాను (ఎవరైనా తోడు దొరికితే).
---
నిన్న ఉదయం నేను తిరుపతిలో ఒక డెర్మటాలజిస్ట్‌ను కలవడానికి వెళ్లాను. నాకు చాలా సంవత్సరాలుగా Psoriasis అనే చర్మ సమస్య ఉంది.
నేను తిరుత్తణి బ్రాంచ్‌లో పని చేస్తున్న సమయంలో, ఒక చీఫ్ మేనేజర్ గారికీ ఇదే సమస్య ఉండేది. ఆయన చెన్నైలో చికిత్స తీసుకుంటున్న డాక్టర్ వివరాలు నాకు ఇచ్చారు. అలా నేను 2019 ఆగస్టు నుంచి చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని Apollo Hospital లో పనిచేసే ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మురళీధర్ రాజగోపాలన్ గారి దగ్గర చికిత్స తీసుకుంటూ వచ్చాను.
ఆయన చాలా సీనియర్ డాక్టర్.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా తన చర్మ సమస్యకు ఆయన దగ్గరే చికిత్స తీసుకున్నారని విన్నాను.
ఆ సమయంలో నేను తిరుత్తణిలో పని చేయడం, నా తమ్ముడు చెన్నైలో Cognizant లో పని చేయడం వల్ల చెన్నైకి వెళ్లడం నాకు సులభంగా ఉండేది. కానీ తర్వాత 2022 ఫిబ్రవరిలో నా తమ్ముడు బెంగళూరులోని Novo Nordisk కంపెనీకి మారిపోవడం, అలాగే అదే సంవత్సరం జూన్ చివరి వారంలో నాకు తిరుపతికి ట్రాన్స్‌ఫర్ రావడంతో, చికిత్స కోసం ప్రతి నెల చెన్నైకి వెళ్లడం కష్టమైంది.
దాంతో తిరుపతిలో మంచి డెర్మటాలజిస్ట్ ఎవరో తెలుసుకుని, డాక్టర్ నీలిమ పార్లపల్లి గారి దగ్గరకు గత సంవత్సరం డిసెంబర్ 24న మొదటిసారి వెళ్లాను. నేను చెన్నైలో తీసుకున్న చికిత్స ఫైల్‌ను ఆమె చూసి, ఆ డాక్టర్‌ను కూడా గుర్తించారు. ఇకపై తిరుపతిలోనే చికిత్స కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.
మొదట ఆమె 6 వారాల మందులు ఇచ్చారు. రెండోసారి నా పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 11న వెళ్లాను. ఆ తర్వాత 2 నెలల మందులు ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండు నెలలు పూర్తవడంతో, నిన్న ఏప్రిల్ 11న మూడోసారి వెళ్లాను.
అయితే, ఆమె చికిత్సలో నాకు అంతగా సంతృప్తి కలగలేదు. ప్రతి సారి “స్ట్రెస్ అవ్వకూడదు” అనేది ప్రధానంగా చెబుతున్నారు. రోజూ అరగంట ధ్యానం చేయమని కూడా సూచిస్తున్నారు. నిజానికి psoriasis కి stress ఒక ముఖ్యమైన కారణం అని నాకు కూడా తెలుసు.
కానీ నా సందేహం — ఈ రోజుల్లో స్ట్రెస్ లేకుండా జీవించడం నిజంగా సాధ్యమా?
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, నా అంగవైకల్యం కారణంగా ప్రతి పని చేయడంలో కొంత stress నాకు తప్పనిసరిగా ఉంటుంది. దానికి తోడు, నా ఉద్యోగం వల్ల వచ్చే ఒత్తిడి వేరే ఉంటుంది.
నేను నా work stress గురించి చెప్పినప్పుడు, ఆమె బయట ఎండలో బరువులు మోసి కూలి పనులు చేసే వారితో నా పరిస్థితిని పోల్చుతూ, “మీరు ACలో పని చేస్తున్నారు, మీకు అంత కష్టం ఏమీలేదు” అన్నట్టుగా మాట్లాడారు. ఆ మాట నన్ను చాలా బాధపెట్టింది.
ప్రతిరోజూ పని సమయంలో నాకు ఎదురయ్యే stress ను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. డబ్బు కావాలి అనే ఒక కారణం కోసం చాలా విషయాలు భరించాల్సి వస్తోంది.
సాధారణంగా మూడు రకాల stress ఉంటాయి — శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి. నా జీవితంలో ఎక్కువగా ఉండేది మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడి. ఇవే Psoriasis ను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని కూడా చెబుతారు.
చివరగా, డాక్టర్ నాకు psychiatric counselling తీసుకోవాలని సూచించారు. కానీ నా stress కు కారణాలు నా చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు మనుషుల వల్లనే అని నేను చెప్పినా, చివరికి నన్నే counselling తీసుకోమని చెప్పడం నాకు ఏమాత్రం నచ్చలేదు.
అయితే, నిన్న రాత్రి Love Today సినిమా చూసిన తర్వాత, నా మనసు కొంచెం హాయిగా అనిపించింది 🙂.
---
— తిరుపతి మహేష్
12/04/2026
Take deep sleep for 8 hours, then all will be come to set right.
ReplyDelete