రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి…
మేము తిరుపతి జగన్నాథపురంలో, గిరిధర్దాస్ వీధిలో ఉన్న చిన్న ఇంట్లో ఉండేవాళ్లం.
ఆ వీధిలో ఒక హ్యాండ్ బోర్ ఉండేది…
దానికి ఎదురుగా వీధి నుంచి లోపలికి మూడు ఇళ్లు వరుసగా ఉండేవి.
మొదటి ఇంటి గడప నేరుగా వీధి వైపే ఉండేది.
ఆ ఇంటికి కుడి పక్కన ఉన్న ఒక చిన్న సంతు ద్వారా లోపలికి వెళ్లితే… ఎడమవైపు మిగతా రెండు ఇళ్లు ఉండేవి.
ఆ మూడు ఇళ్లలో…
మధ్యలో ఉన్న ఇంట్లోనే నేను, నా తల్లిదండ్రులు, నా తమ్ముడు ఉండేవాళ్లం.
1997 జూన్ చివరి వారంలో…
నన్ను చెన్నైలోని అంధుల ప్రత్యేక పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించడంతో,
అప్పటి నుంచి నా హాస్టల్ జీవితం ప్రారంభమైంది.
అది మొదటి తరగతా, రెండో తరగతా అన్నది ఇప్పుడు నాకు స్పష్టంగా గుర్తు లేదు.
ఒకసారి సెలవులకు ఇంటికి వచ్చేసరికి…
చూస్తే, ఆ మూడు ఇళ్లను renovation చేసి రెండు ఇళ్లుగా మార్చేశారు.
మూడు ఇళ్లు రెండుగా మారిన తర్వాత…
మేము పెద్ద ఇంట్లోనే, అదే గిరిధర్దాస్ వీధిలో ఉండిపోయాము.
---
1975ల కాలంలో… నారాయణవనం మండలం, సముదాయం గ్రామానికి చెందిన మా నాయనమ్మ నగరి లక్ష్మమ్మ, తిరుపతిలో నివసిస్తున్న తన కుమార్తె రాజమ్మ మరియు అల్లుడు మొక్కల చెంగా రెడ్డి సహాయంతో, తిరుపతిలోని యాదవ వీధిలో సుమారు 30 అంకణాల్లో ఉన్న ఒక పెంకుటిల్లును కొనుగోలు చేశారు.
2002 సెప్టెంబర్‌లో ఆ పాత పెంకుటిల్లు పూర్తిగా కూల్చి,
కొత్త ఇంటికి పునాది వేశారు.
చాలా మంది కష్టంతో, సహకారంతో
చిన్న సందులోపల ఉన్న స్థలంలో మూడు అంతస్తుల భవనం కట్టారు.
గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లలో
ప్రతి అంతస్తులో మూడు ఇళ్లు నిర్మించగా,
మూడో అంతస్తులో సగం స్థలంలో ఒక ఇల్లు మాత్రమే నిర్మించారు.
2004 ఫిబ్రవరిలో ఆ ఇంటికి గృహప్రవేశం జరిగింది.
ఆ తర్వాత…
జగన్నాథపురం నుంచి మేము యాదవ వీధిలోని మూడో అంతస్తులో ఉన్న ఇంటికి మారాము.
అక్కడే దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి.
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు…
2024 ఏప్రిల్ 9, మంగళవారం — ఉగాది రోజు.
యాదవ వీధిలోని మూడో అంతస్తులో 20 సంవత్సరాలు గడిపిన ఆ ఇంటిని వదిలి,
మా తల్లిదండ్రులు, తమ్ముడు
తిరుపతి ఎస్టీవీ నగర్లో ఉన్న గ్నాపిక ఎన్క్లేవ్ అపార్ట్మెంట్కి పర్మనెంట్‌గా షిఫ్ట్ అయ్యారు.
నేను మాత్రం వెంటనే అపార్ట్మెంట్కి వెళ్లలేదు…
10 రోజులు యాదవ వీధిలోని ఆ ఇంట్లోనే ఉండిపోయాను.
ఏప్రిల్ 19, 2024 — శుక్రవారం…
చివరికి నేను అపార్ట్మెంట్కి మారాను.
---
2023 జనవరిలో…
నేను, నా తమ్ముడు వింటర్ లడఖ్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చాక,
ఒక రోజు సాయంత్రం బ్యాంక్ నుంచి నేరుగా తిరుపతిలో ఉన్న ఒక అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్కి
మా ఇంట్లో వాళ్లు నన్ను తీసుకెళ్లారు.
అప్పుడు అక్కడ పిలర్స్ వేసి, గోడలు మాత్రమే కట్టి,
ఐదు అంతస్తుల వరకూ మోల్డింగ్ చేసి ఉంచారు.
ఇంకా మిగతా పనులు ప్రారంభం కాలేదు.
ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలని మా తల్లిదండ్రుల ప్లాన్.
అపార్ట్మెంట్ చూసి ఇంటికి వచ్చిన తర్వాత…
ముందుగానే అపార్ట్మెంట్ కొనుగోలు విషయంపై నేను ఒక సలహా ఇచ్చాను.
పుత్తూరులో ఉన్న ప్లాట్ అమ్మితే బాగుంటుందని చెప్పాను.
ఆ ప్లాట్‌ను మా నాన్న 2005 లేదా 2006 సమయంలో కొనుగోలు చేసి ఉండవచ్చు.
భవిష్యత్తులో నేను కానీ, నా తమ్ముడు కానీ అక్కడ స్థిరపడే ఆలోచన అసలు లేకపోవడంతో,
దాదాపు 15 సంవత్సరాలుగా ఉపయోగం లేకుండా ఉన్న ఆ ప్లాట్‌ను అమ్మి,
ఆ డబ్బును అపార్ట్మెంట్ కొనడానికి ఉపయోగిస్తే మంచిదని అనిపించింది.
ఆ విషయం ఇంట్లో చెప్పినప్పుడు…
నా మాట ఎవరూ వినలేదు.
“ఆస్తి అమ్మితే మళ్లీ కొనలేము” —
అదే మాట మళ్లీ మళ్లీ వినిపించింది.
నేను ఎందుకు అలా చెబుతున్నానో ఆలోచించడానికి కూడా ఎవరికీ ఆసక్తి కనిపించలేదు.
ఇప్పుడు వెనక్కి చూసుకుంటే —
వినని వాళ్లతో వాదించడం వల్ల అమూల్యమైన నా సమయం, మనశ్శాంతి
వృథా చేసుకున్నానని అనిపిస్తోంది.
మా ఇంట్లో వాళ్లకు డబ్బు, ఆస్తుల మీద ఉన్న ప్రేమ, మమకారం…
మనుషుల మీద, ముఖ్యంగా నా మీద, ఎప్పుడూ కనిపించలేదు.
2023 డిసెంబర్లో అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి…
2024 ఫిబ్రవరి 14న, గ్నాపిక ఎన్క్లేవ్, B బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న
ఫ్లాట్ నంబర్ 106లో గృహప్రవేశం జరిగింది.
యాదవ వీధిలో ఉన్న ఇంట్లో… 2004 ఫిబ్రవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు
దాదాపు 20 సంవత్సరాలు గడిపాను.
అక్కడ నాకు మాట్లాడేందుకు,
అవసరం అయితే సహాయం చేసేందుకు
సాయంత్రం వేళ ఇంటి బయట నడవడానికి కూడా సౌకర్యం ఉండేది.
కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో… రెండు సంవత్సరాలు అయినా
నాకు వ్యక్తిగతంగా ఒక్కరితో కూడా పరిచయం ఏర్పడలేదు.
ఈ రెండు సంవత్సరాలు… అపార్ట్మెంట్ పై టెర్రస్‌లో గాని, కింద అపార్ట్మెంట్ చుట్టూ గాని
ఎక్కడా నేను ఒంటరిగా నడవడానికి కూడా వీలుకాని పరిస్థితి.
నిజంగా నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది.
ఎంత పెద్ద ఇల్లు అన్నదానికన్నా, అందులో ఉండే వాళ్లు ఎంత సంతోషంగా ఉంటారన్నదే ముఖ్యము.
నాలుగు గోడల మధ్యే గడపడం…
అందులోనూ నన్ను అర్థం చేసుకునే వాళ్లు చుట్టూ లేకపోవడంతో,
ఈ రెండు సంవత్సరాలు మానసిక ఇబ్బందులతో గడిచిపోయాయి.
ఇకపై రాబోయే కాలం ఎలా ఉండబోతుందో…
ఈ గ్నాపిక ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో చూడాలి.
---
– తిరుపతి మహేష్
09/04/2026
Waiting for solutions mahesh...
ReplyDelete