మూడవ సంవత్సరం…
నిన్న — ఏప్రిల్ 19, ఆదివారం.
ఒక బ్లాగ్ రాయాలని ముందే అనుకున్నాను. దేనిగురించి రాయాలో ఐడియా కూడా ఉంది.
కానీ… శనివారం ఉదయం నుంచే నా మనసు అస్సలు బాగోలేదు.
ఉదయం బ్యాంక్‌లో నా కౌంటర్‌కి కస్టమర్లు కూడా ఎక్కువగానే వచ్చారు.
రోజంతా ఏదో ఒక అలసట… అసహనం… కలిసిన ఫీలింగ్‌తో గడిచింది.
ప్రతి శుక్రవారం బ్యాంక్ అయిపోయాక సాయంత్రం 4:45కి KT రోడ్‌లో ఉన్న సాగర్ అన్న సలూన్‌కి వెళ్తాను.
ఈసారి మాత్రం శుక్రవారం కాకుండా… శనివారం వెళ్లాను.
అక్కడి నుంచి… బ్యాంక్ పక్కనే ఉన్న VV మహల్ రోడ్‌లో, కళానికేతన్ ఎదురుగా ఉన్న Smile Dental Care కి వెళ్లాను.
వారం రోజులుగా “వెళ్లాలి… వెళ్లాలి…” అనుకుంటూనే ఉన్నాను.
చివరకు ఆ రోజు సాయంత్రం వెళ్లగలిగాను.
గత సంవత్సరం ఏప్రిల్‌లో అక్కడే ఒక పళ్లకి రూట్ కెనాల్ చేసి, క్యాప్ పెట్టించుకున్నాను.
అప్పుడు వాళ్లు — “ఆరు నెలలకు ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే మంచిది” అని చెప్పారు.
ఇటీవల నాకు తెలిసిన వాళ్లలో చాలా మందికి పళ్ల సమస్యలు వచ్చి వేలల్లో ఖర్చు పెడుతున్నారని చూస్తుంటే…
నా పళ్లను ఒకసారి ముందు జాగ్రత్తగా చెక్ చేయించుకోవాలి అనిపించింది.
అదీ కాక… బ్యాంక్ పక్కనే క్లినిక్ ఉండటం, అక్కడ పని చేసే జూనియర్ డాక్టర్ నా సహోద్యోగి వైష్ణవి చెల్లెలు కావడం వల్ల,
గత సంవత్సరం అక్కడే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నాను.
ఇప్పుడు… ఏడాది తర్వాత మళ్లీ వెళ్లి పళ్ల క్లీనింగ్ చేయించుకున్నాను.
ఒక చిన్న సమస్య ఉండడంతో సిమెంట్ కూడా పెట్టించుకున్నాను.
పేమెంట్ చేసిన తర్వాత… సీనియర్ డాక్టర్ చెప్పిన ఒక మాట మాత్రం నా మైండ్‌లో నిలిచిపోయింది:
“ఉదయం మాత్రమే కాదు… రాత్రి కూడా తప్పకుండా బ్రష్ చేయాలి.
అప్పుడే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.”
ఆ మాట గురించి ఆలోచిస్తూ క్లినిక్ నుంచి బయటకు వచ్చాను.
పక్కనే ఉన్న బ్యాంక్‌కి వెళ్లి కొంచెం సేపు ఉండి…
తర్వాత Rapido బుక్ చేసి ఇంటికి బయలుదేరాను.
నన్ను పిక్ చేయడానికి వచ్చిన వ్యక్తి… ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు నన్ను తీసుకెళ్లిన వ్యక్తిలానే అనిపించింది.
నన్ను చూసి — “ఏమిటీ సర్… ఈ టైమ్‌లో బ్యాంక్ నుంచి బయలుదేరుతున్నారు?” అని అడిగాడు.
నేను — “బ్యాంక్ పని ఎప్పుడో అయిపోయింది… పక్కనే డెంటల్ క్లినిక్‌కి చెక్‌అప్ కోసం వెళ్లి వస్తున్నాను.
అందుకే కొంచెం లేట్ అయింది” అన్నాను.
రైడ్ మొదలయ్యాక కొంతసేపటికి… అతనే మాట్లాడడం ప్రారంభించాడు.
“సర్… నేనూ ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాలి అనుకుంటున్నాను.
పళ్లలో సమస్య ఉంది.
ఒక పళ్లకి రూట్ కెనాల్ చేయించుకోవాలంటే ఏడు వేల రూపాయలకి పైగా అవుతుందని చెబుతున్నారు.
వారం మొత్తం సంపాదించినదంతా ఒక పళ్ల సమస్యకే ఖర్చు చేయాల్సి వస్తోంది సర్…
ఇంకా కుటుంబాన్ని ఎలా పోషించాలి సర్…” అన్నాడు.
ప్రతిరోజూ కొత్త కొత్త మనుషులతో మాట్లాడుతుంటే… ఒక విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది —
ప్రతి మనిషి కష్టాల వెనుక… ఎక్కువగా ఆర్థిక సమస్యలే ఉంటాయి.
మన దేశంలో చాలా మందికి పరిస్థితి — “రెక్కాడితే గానీ డొక్కాడని” స్థాయి.
వాళ్లకు ఒక గాఢమైన నమ్మకం ఉంటుంది — “దేవుడు ఉన్నాడు… ఒక రోజు మంచిదే జరుగుతుంది.”
కానీ నిజం ఏమిటంటే…
రోజురోజుకీ ఖర్చులు పెరుగుతున్నాయి… బాధ్యతలు పెరుగుతున్నాయి…
సామాన్యుడి జీవితంలో కష్టాలు మాత్రం తగ్గడం లేదు.
మనసులో ఏదో అనుకుంటూ… ఆ రోజు Rapido క్యాప్టెన్‌తో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చి, రాత్రి పెరుగన్నం తిని… పడుకున్నాను.
---
నిన్న — ఏప్రిల్ 19, ఆదివారం.
ఉదయం 9 గంటలకు మెలకువ వచ్చింది.
“ఇవాళైనా బ్లాగ్ రాయాలి” అనుకున్నా…
కానీ రోజు మొత్తం మానసిక బద్ధకంతో నా రూమ్‌లోనే ఏమీ చేయకుండా సమయం గడిచిపోయింది.
రెండు సంవత్సరాలు వెనక్కి వెళితే…
---
ఆ రోజు — ఏప్రిల్ 9, 2024. మంగళవారం… ఉగాది రోజు.
మేము 20 సంవత్సరాలు తిరుపతి యాదవ వీధిలో ఉన్న మూడవ అంతస్తులోని పాత ఇంటిని వదిలి
కొత్త ఫ్లాట్‌కి మారాలని ఇంట్లో వాళ్లు నిర్ణయించుకున్నారు.
కానీ నేను మాత్రం స్పష్టంగా — “నేను రాను” అని చెప్పేశాను.
2023 జనవరి నుంచి గ్నాపిక ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ కొనాలి అన్న మాట మొదలైనప్పటి నుంచి మా ఇంట్లో — నాకు, నా తల్లిదండ్రులకు మధ్య విభేదాలు మొదలయ్యాయి.
చివరికి… 2024 ఫిబ్రవరి 14న గృహప్రవేశం చేసి, ఏప్రిల్ 9న కొత్త ఇంటికి వెళ్లిపోయారు.
నేను మాత్రం… యాదవ వీధిలోని మా పాత ఇంట్లోనే ఒక్కడినే ఉండిపోయాను.
ఉదయం లేవడం, రెడీ అవడం, బ్యాంక్‌కి వెళ్లడం,
తిరిగి ఇంటికి రావడం… ఒంటరిగా ఉండటం… “అలా రోజులు ఎలా గడిచాయో… ఇప్పుడు తిరిగి చూసుకుంటే స్పష్టంగా గుర్తులేదు.”
నా తల్లిదండ్రులు… బంధువుల ద్వారా నన్ను ఒప్పించి, ఎలాగైనా అపార్ట్‌మెంట్‌కి రప్పించుకోవాలని ప్రయత్నించారు.
కానీ నేను మాత్రం ఎక్కడా తగ్గకూడదని ఫిక్స్ అయ్యాను.
కానీ ఒక దశలో… ఒక కండిషన్ పెట్టాను — అది నెరవేరితేనే నేను అపార్ట్‌మెంట్‌కి వస్తాను అన్నాను.
ఆ కండిషన్ ఏమిటంటే…
---
2023 మార్చిలో, తిరుపతిలో జీవకోనలో ఉన్న సుమారు 25 అంకణాల స్థలంలో ఉన్న మూడు ఇళ్లను (మా తల్లిదండ్రులు 2010కు ముందే కొనుకున్నవి)
renovation చేయాలని పనులు ప్రారంభించారు.
ఆ సమయంలో వరుసగా 3 నెలలు — నా పూర్తి జీతం ₹40,000 చొప్పున ఇంటికి ఇచ్చాను.
నా తమ్ముడు కూడా మూడునెలలు ₹60,000 చొప్పున ఇచ్చాడు.
మేమిద్దరం కలిసి ఆ జీవకోన ఇంటి కోసం మూడు నెలల్లో సుమారు ₹3 లక్షలు ఇచ్చాం.
అంతేకాదు…
అదే సంవత్సరం జూన్ 19, జూలై 27 తేదీల్లో
నా OD అకౌంట్‌లోని డబ్బు మరియు జూన్, జూలై నెలల జీతం మొత్తం కలిపి
మొత్తం ₹5 లక్షలు ప్రత్యేకంగా నేను ఇచ్చాను.
2023 అదే సంవత్సరం అక్టోబర్‌లో ఇల్లు రెడీ అయిన తర్వాత, బంధువులకు ఎవరికి చెప్పకుండా పాలు పొంగిస్తాం అని మా తల్లిదండ్రులు అనుకున్నారు.
కానీ నేను మాత్రం ‘అందరికీ తెలియాలి’ అని పట్టుబట్టి…
చివరికి బంధువులందరినీ పిలిచి, పాలు పొంగించి కార్యక్రమం పూర్తి చేశారు.
ఆ ఇంటి కోసం నేను ప్రత్యేకంగా ఇచ్చిన ₹5 లక్షలు తిరిగి ఇవ్వాలని నేను అడిగాను.
“అది ఇస్తేనే నేను కొత్త ఫ్లాట్‌కి వస్తాను” అన్నాను.
చివరికి… 2024 ఏప్రిల్ 19 — శుక్రవారం ఉదయం, నేను ఏ అకౌంట్ నుంచి డబ్బు పంపానో అదే అకౌంట్‌కి ₹5 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఆ రోజు సాయంత్రం… బ్యాంక్ నుంచి నేరుగా నేను కూడా గ్నాపిక ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లోని కొత్త ఫ్లాట్‌కి మారిపోయాను.
---
ఆ రోజు నుంచి ఇప్పటివరకు —రెండు సంవత్సరాలు గ్నాపిక ఎన్‌క్లేవ్‌లో గడిచిపోయాయి.
ఈ రెండు సంవత్సరాల్లో
నేను చాలా మానసిక వేదన అనుభవించాను.
అది ఎవరికీ పూర్తిగా తెలియదు… అర్థం కూడా కాదు.
చెప్పాలంటే —
ఇప్పటికీ అనుభవిస్తున్నాను.
ఇప్పుడు…
గ్నాపిక ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో నాకు మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
చూడాలి…
రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో.
Hope for the best.
“ఇల్లు ఎంత పెద్దదో కాదు… అందులో ఎంత సంతోషం ఉందో ముఖ్యం.”
ఆ విషయానికి వస్తే…
ప్రస్తుతం మేము ఉన్న ఈ ఫ్లాట్‌లో ఆ సంతోషం నాకు అసలు కనిపించడం లేదు.
ఈ రెండు సంవత్సరాల్లో జరిగిన మంచి విషయం ఒక్కటే —
నా తమ్ముడి పెళ్లి.
---
2004 ఫిబ్రవరిలో యాదవ వీధికి
మేము అంతకుముందు ఉన్న ఇంటి నుంచి మారిన కథను పదిరోజుల క్రితం ఒక బ్లాగ్‌గా రాశాను.
అది చదవాలనుకుంటే…ఇక్కడ
క్లిక్ చేసి చదవండి.
– తిరుపతి మహేష్
20/04/2026
Comments
Post a Comment