ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

నిన్న సాయంత్రం బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చాక, రాత్రి 7 గంటల సమయంలో KT రోడ్‌లో ఉన్న భాటా షోరూమ్ కింద ఉన్న సాగర్ అన్న సలోన్‌కి Rapido బుక్ చేసుకుని వెళ్లాను.

నాకు తెలిసిన వాళ్లు తిరుమల వడ, లడ్డూ కూరియర్‌లో పంపించమని అడిగారు. అందుకే సాగర్ అన్నకి, తిరుమలలో పనిచేసే తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే, వడ మరియు లడ్డూ నాకు తీసుకురమ్మని సోమవారం ఉదయం చెప్పాను.

నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన కాల్ చేసి, నేను అడిగినవి వచ్చాయని చెప్పారు. అందుకే యోగా క్లాస్ అయిపోయిన వెంటనే సాగర్ అన్న షాప్‌కి వెళ్లి, వడ మరియు లడ్డూ తీసుకున్నాను.

అవి తీసుకున్న తర్వాత, కొద్దిసేపు సాగర్ అన్నతో మాట్లాడాను. ఆ తర్వాత ఆయన సలోన్ పక్కనే ఉన్న అనిల్ అన్న పెయింట్ షాప్‌కి వెళ్లి, అతనితో కొద్దిసేపు మాట్లాడి ఇంటికి వెళ్లాలని అనుకున్నాను.

“అనిల్ అన్న ఉన్నాడా?” అని అడిగితే…

“లేడు, ఈరోజు షాప్ క్లోజ్ చేశాడు” అని సాగర్ అన్న చెప్పారు.

అది విన్నాక నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది.

ఎందుకంటే…

సంవత్సరంలో 365 రోజుల్లో, 4 లేదా 5 రోజులు మాత్రమే షాప్ మూసే వ్యక్తి ఆయన. అదీ ఎక్కువగా పండగల రోజుల్లో మాత్రమే.

అలాంటి అనిల్ అన్న ఈరోజు షాప్ క్లోజ్ చేశాడంటే… కారణం ఏమిటి అని అడిగితే, తిరుమలకు వెళ్లాడని చెప్పారు.

ఆ తర్వాత నేను మళ్లీ Rapido బుక్ చేసుకుని ఇంటికి వచ్చేశాను.

ప్రతి శుక్రవారం సాయంత్రం సాగర్ అన్న సలోన్‌కి వెళ్లడం నాకు అలవాటు.

అలా గత శుక్రవారం — గుడ్ ఫ్రైడే రోజు — సాయంత్రం సాగర్ అన్న సలోన్‌కి వెళ్లి, పక్కనే ఉన్న అనిల్ అన్న పెయింట్ షాప్‌కి వెళ్లాను. అక్కడ దాదాపు రెండు గంటలపాటు కూర్చొని అనిల్ అన్నతో మాట్లాడాను.

అంతసేపు అనిల్ అన్నతో నేను మాట్లాడటం అదే మొదటి సారి.

ఆ రెండు గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు.

---

10వ తరగతి ఫెయిల్ అయిన అనిల్ అన్న…

కుటుంబ పరిస్థితుల వల్ల తిరుపతిలో సున్నపు వీధిలో ఉన్న ఒక ప్రసిద్ధ ప్రొవిజన్స్ షాప్‌లో దాదాపు రెండు సంవత్సరాలు పని చేశాడు.

ఆ షాప్‌లో పరిస్థితి ఎలా ఉంటుందంటే — ఉదయం నుంచి రాత్రి వరకు పని… పని… పని…

ఒక్క నిమిషం కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండదు.

చిన్నప్పుడు మేము సరుకులు తీసుకురావాలంటే, మేము కూడా ఆ షాప్‌కే వెళ్లేవాళ్లం. ఒక నెల సరుకుల లిస్ట్ ఇచ్చిన తర్వాత, వాటిని తీసుకుని బయటకు రావడానికి రెండు గంటలకంటే ఎక్కువ సమయం పడేది.

అలాంటి చోట పని చేసే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఆ తర్వాత…

ఆ పని తన వల్ల కాదని భావించి, 1999 ప్రాంతంలో ఒక పెయింట్ షాప్‌లో పని ప్రారంభించాడు.

అక్కడ పని తక్కువగా ఉండడంతో పాటు, షాప్ యజమాని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని అనిల్ అన్న చెప్పారు.

పది సంవత్సరాల తర్వాత — 2009లో —

ఆ షాప్ యజమాని అదే షాప్‌ను అనిల్ అన్నకి అప్పగించాడు.

అలా…

పని చేసిన చోటే యజమానిగా మారి, అనిల్ అన్న 2009 నుంచి 2019 వరకు దాదాపు పది సంవత్సరాలు విజయవంతంగా ఆ షాప్‌ను నడిపించాడు.

2019లో షాప్ రెంట్ పెరగడంతో, అది తనకు కుదరదని భావించి, షాప్‌ను ఎదురుగా ఉన్న ఒక చిన్న షాప్‌కి మార్చాడు.

ఆ షాప్ పక్కనే సాగర్ అన్న సలోన్ ఉండడం వల్ల, అలా నాకు అనిల్ అన్న పరిచయం అయ్యాడు.

గత శుక్రవారం అనిల్ అన్నతో రెండు గంటలు మాట్లాడిన తర్వాత…

ఆయన జీవితం, ఆయన కుటుంబం — నిజంగా ఎంతో ప్రేరణ కలిగించింది.

ఈ రోజుల్లో ఒక మంచి ఉమ్మడి కుటుంబానికి ఉత్తమ ఉదాహరణగా

అనిల్ అన్న మరియు ఆయన అన్న పార్థసారథి కుటుంబాన్ని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఒకే ఇంట్లో —

అనిల్ అన్న, ఆయన భార్య, కుమార్తె

ఆయన అన్నయ్య పార్థసారథి, వదిన, వారి కుమార్తె

అలాగే వారి తల్లిదండ్రులు

మొత్తం ఎనిమిది మంది…

ఒకే ఆలోచనతో, ఒకే ఇంట్లో కలిసి జీవించడం — ఈ కాలంలో నిజంగా గొప్ప విషయం.

ఏ స్వార్థం లేకుండా…

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కలిసి జీవిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి… నాకు నిజంగా ఎంతో సంతోషంగా అనిపించింది.

కుదిరితే…

ఒక రోజు వారి ఉమ్మడి కుటుంబ కథను పూర్తిగా రాయాలి అనిపిస్తోంది.

చూడాలి…

---

– తిరుపతి మహేష్

08/04/2026

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం