వెళ్లాలని ఉంది… కానీ కుదరట్లేదు
నిన్న గుడ్ ఫ్రైడే కావడంతో బ్యాంక్ హాలిడే.
వారం క్రితం నుంచే, మా పూర్వీకుల గ్రామమైన నారాయణవనం మండలంలోని సముదాయం గ్రామంలో ఉన్న నా బాబాయి నగరి సుబ్రమణ్యం రెడ్డిని కలవాలని అనుకున్నాను.
గత వారం పుత్తూరులో ఉన్న నా పెత్తనాన కూతురు ఉషా అక్క ఇంటికి వెళ్లినప్పుడు, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో అనుకోకుండా బాబాయి కూడా ఒక పనిమీద పుత్తూరు వచ్చి, అక్క ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోయారు.
ఆ సమయంలోనే నా మనసులో ఉన్న మాట చెప్పాను –
“నిన్ను కలవాలని ఉంది… కుదిరితే వచ్చే వారం వస్తాను” అని.
దానికి బాబాయి ఇచ్చిన సమాధానం విన్నప్పుడు, ఆయన పరిస్థితిని గుర్తు చేసుకుని నాకు చాలా బాధ వేసింది.
అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎలా అయినా సముదాయం గ్రామానికి వెళ్లాలని అనుకున్నాను.
కానీ… కుదరలేదు.
---
చివరిసారి నేను సముదాయం గ్రామానికి వెళ్లింది 2022 డిసెంబర్‌లో అనుకుంటాను.
సముదాయం గ్రామం అంటే మా నాన్నగారి పూర్వీకుల గ్రామం.
నగరి చెంగారెడ్డి గారు, నగరి లక్ష్మమ్మ గారు – మా తాతయ్య, నాయనమ్మ.
వారికి రాజమ్మ, రామకృష్ణారెడ్డి, నాథముని రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి అనే సంతానం కలిగారు.
ఇంకా కొంతమంది పిల్లలు చిన్న వయస్సులోనే పుట్టి, ఏదో ఒక ఆరోగ్య సమస్య కారణంగా మరణించారని విన్నాను.
1960-61 ప్రాంతంలో, రాజమ్మ గారిని తిరుపతిలో నిమ్మకాయల వీధిలో నివసించే మొక్కల చెంగారెడ్డి గారికి ఇచ్చి వివాహం చేశారు.
రామకృష్ణారెడ్డి గారు డిప్లొమా చదివి, తమిళనాడులోని పల్లవన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగం రావడంతో చెన్నైకి వెళ్లారు.
తిరుపతి పక్కన ఉన్న పెరుమాళ్‌పల్లి గ్రామంలో సంబంధం చూసి పెళ్లి చేసుకుని, చెన్నైలో స్థిరపడ్డారు.
కానీ 1983 ఫిబ్రవరిలో, చాలా చిన్న వయస్సులోనే, దాదాపు 33 ఏళ్ల వయసులో నా పెత్తనాన్న రామకృష్ణారెడ్డి గారికి హార్ట్ అటాక్ రావడంతో హఠాత్తుగా మరణించారు.
ఆ సమయంలో ఆయన భార్య నగరి మునిరత్నమ్మ గారికి ఆరు సంవత్సరాల కొడుకు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు.
ఆ కుటుంబానికి అండగా నిలిచింది మా నాయనమ్మ లక్ష్మమ్మ గారు మరియు ఆమె ఇద్దరు కుమారులు.
ఆ తర్వాత నగరి లక్ష్మమ్మ కుమార్తె మొక్కల రాజమ్మ తన ఇద్దరు కుమార్తెలను తన సొంత తమ్ముళ్లకు ఇచ్చి పెళ్లి చేసింది.
మా నాన్నగారు నాథముని రెడ్డి గారు చదువు మరియు ఉద్యోగం రీత్యా తిరుపతికి వలస రావడంతో, నేను మరియు నా తమ్ముడు తిరుపతిలో పుట్టి పెరిగాము.
మా బాబాయి సుబ్రమణ్యం రెడ్డి గారు మాత్రం గ్రామంలోనే ఉండి, ఇప్పటికీ తనకు 60 ఏళ్లు దాటినా కూడా తన కుటుంబ జీవనోపాధి కోసం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు.
తన ఏకైక సంతానమైన బాబాయి కుమారుడు వాసు సముదాయం గ్రామంలోనే పుట్టి పెరిగాడు.
---
నగరి లక్ష్మమ్మకు వయసు పైబడడంతో, 2015లో తిరుపతి మరియు సముదాయం గ్రామాల్లో ఉన్న ఇళ్లు, పొలాలు సహా తన పేరుమీద ఉన్న మొత్తం కుటుంబ ఆస్తులను మూడు భాగాలుగా విభజించారు.
ఆ విభజనలో, సముదాయం గ్రామంలో ఉన్న పూర్వీకుల పాడుబడిపోయిన పాత ఇల్లు మా నాన్నగారికి వచ్చింది.
ఆ ఇంటిని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో,
2020 డిసెంబర్ 10న (భారత ప్రధాని శ్రీ Narendra Modi గారు కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన రోజునే)
ఆ పనులు ప్రారంభించారు.
సుమారు 8 నెలల్లో 12 లక్షలు ఖర్చు చేసి ఆ ఇంటిని పునర్నిర్మించారు.
2021 ఆగస్టు 13, శుక్రవారం నాడు గృహప్రవేశం కూడా చేశారు.
తర్వాత మేము దాదాపు 10 నెలలు ఆ ఇంట్లో నివసించాము (2022 జూన్ 24, శుక్రవారం వరకు).
ఆ సమయంలో నేను ప్రతి రోజు సముదాయం నుంచి తిరుత్తణికి వెళ్లి వచ్చేవాడిని.
నా జీవితంలో అవి ఎంతో మధురమైన జ్ఞాపకాల రోజులు.
ఆ మధుర జ్ఞాపకాలకు అత్యంత ముఖ్యమైన కారణం, అప్పుడే ట్రాన్స్‌ఫర్‌లో చెన్నై నుంచి తిరుత్తణి బ్రాంచ్‌కు వచ్చిన కొత్త జూనియర్ అమ్మాయి యామని.
ప్రతి రోజు ఉదయం సమయంలో నేను, యామని, షణ్ముగం ముగ్గురం కలిసి పుత్తూరు నుంచి ట్రైన్‌లో తిరుత్తణికి వెళ్లేవాళ్లం.
ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని నేను ఎదురుచూస్తున్న ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్ చివరికి నాకు రావడంతో మళ్లీ తిరుపతికి వచ్చేశాము.
ఆ తర్వాత అదే సంవత్సర నేను సముదాయం గ్రామానికి కేవలం మూడు సార్లు మాత్రమే వెళ్లాను.
గత మూడు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను వెళ్లలేదు.
కానీ బాబాయిని కలవాలని గత కొన్ని రోజులుగా నాకు అనిపిస్తోంది.
నిన్న వెళ్లాలని అనుకున్నా, చివరికి కుదరలేదు.
త్వరలో ఒక రోజు సముదాయం గ్రామానికి వెళ్లి బాబాయిని కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను.
అది నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.
ఇప్పుడు బస్సు ఎక్కాలంటేనే బద్ధకం వేస్తోంది.
కానీ ఒకప్పుడు నేను ప్రతిరోజూ తిరుత్తణి వరకు ప్రయాణించేవాడినని గుర్తు చేసుకుంటే… నాకు ఆశ్చర్యం వేస్తోంది.
---
తిరుపతి మహేష్
04/04/2026
Nice family history 👏 👍
ReplyDelete