ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న

నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది.

పది సంవత్సరాలకు పైగానే తనతో నాకు పరిచయం. నేను ఎస్‌వీ యూనివర్సిటీలో ఎం.ఏ చదివే రోజుల్లో పరిచయమైంది.

ఎప్పుడో నెలకి ఒకసారి… లేక రెండు సార్లు… తనే కాల్ చేసి మాట్లాడేది.

అది కూడా ఎక్కువగా ఆదివారం ఉదయం సమయాల్లోనే ఉంటుంది.

నేనైతే చాలా అరుదుగానే తనకి కాల్ చేస్తాను.

సడన్‌గా గత వారం శుక్రవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి  తన నుంచి నాకు కాల్ వచ్చింది.

“హలో” అనగానే…

తన ఆరోగ్యం బాగోలేదని అర్థమైపోయింది. “ఏమైంది?” అని అడిగేలోపే…

రెండు మాటలు మాట్లాడేసి నాకు యోగా క్లాస్‌కి టైమ్ అవుతుండడంతో ఆ రోజు కాల్ కట్ చేశాను.

---

మళ్లీ మొన్న శనివారం సాయంత్రం… అదే ఆరు గంటల సమయంలో కాల్ చేసింది.

అప్పుడే నా మూవీ పార్ట్నర్ రూపు కుమార్ కాల్ చేసి “అపార్ట్‌మెంట్ కిందకి వచ్చేశాను” అని చెప్పాడు.

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నేను ఇంటి మెయిన్ డోర్ లాక్ చేస్తున్న టైమ్‌లో తన నుంచి కాల్ వచ్చింది.

కాల్ లిఫ్ట్ చేస్తే…

“హలో మహేష్…” అనగానే ఇంకా తన ఆరోగ్యం కుదుటపడలేదని తన గొంతు వింటేనే తెలిసిపోయింది.

నాకేమో ఆ రోజు మూవీకి వెళ్లాలి. కాబట్టి ఆ రోజూ కూడా తనతో సరిగా మాట్లాడలేకపోయాను.

---

వారం క్రితం… చాలా రోజుల తర్వాత సూర్య హీరోగా నటించిన సినిమా ‘వీరభద్రుడు’ రిలీజ్ అవుతుందని తెలిసింది.

థియేటర్‌లో చూడాలని ఫిక్స్ అయ్యాను.

మొదటగా మే 14 గురువారం రిలీజ్ కావాల్సిన సినిమా… ఉదయం తొమ్మిది గంటల షో పడే సమయానికి చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయిందనే వార్త వచ్చింది.

ప్రొడ్యూసర్‌కు ఫైనాన్షియల్ ఇష్యూస్ అంట.

సూర్య సినిమా కాబట్టి… వీక్‌డే అయినా చాలా మంది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని థియేటర్లకి వెళ్లారట.

కానీ వాళ్లందరికీ నిరాశే. కనీసం మధ్యాహ్నం 12 గంటల షో అయినా పడుతుందేమో అని చాలామంది థియేటర్ బయటే వెయిట్ చేశారట.

కానీ ఆ రోజంతా సినిమా రిలీజ్ కాలేదు.

ఫైనల్‌గా ఫైనాన్షియల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుని మరుసటి రోజు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ‘వీరభద్రుడు’ రిలీజ్ అయింది.

శనివారం మధ్యాహ్నం బ్యాంక్‌లో ఉన్నప్పుడు సడన్‌గా ఆ రోజు సాయంత్రం ఆరున్నర షోకి వెళ్దామా అని నా మూవీ పార్ట్నర్‌కి కాల్ చేశాను.

తను “వెల్దాం” అన్నాడు.

ఎప్పుడూ నాకు సినిమా మొదటి సీన్ నుంచే మిస్ కాకుండా చూడాలని అనుకుంటాను.

అలాగే ఆ రోజు సరిగ్గా ఆరున్నరకు మేము థియేటర్‌కి చేరుకుని

మా సీట్లలో కూర్చున్నాం.

లక్కీగా ‘కరుప్పు’ సినిమాకి ఆడియో డిస్క్రిప్షన్ కూడా ఉండడంతో డబుల్ హ్యాపీ naaku 🙂.

ఎప్పుడూ తమిళ సినిమాలు తమిళంలోనే చూడాలని నాకు, రూపు కుమార్‌కి ఇష్టం.

సూర్య తమిళంలో నటించిన ‘కరుప్పు’ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు.

సూర్య సినిమా కావడంతో థియేటర్ హౌస్‌ఫుల్.

రెండేళ్ల క్రితం ఇదే సూర్య నటించిన ‘కంగువా’ సినిమాకి కూడా మేమిద్దరం వెళ్లాం.

అప్పుడూ థియేటర్ హౌస్‌ఫుల్. సగానికి పైగా ఫ్యామిలీ ఆడియన్స్. అదే పరిస్థితిని ఇప్పుడు కూడా చూశాను.

సూర్య ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. చివరగా వచ్చిన సినిమాల్లో ఒక్కటీ చెప్పుకునేలా లేదు. కనీసం ఈ ‘కరుప్పు / వీరభద్రుడు’ ఎలా ఉండబోతుందా అని సినిమా చూడడం స్టార్ట్ చేశాను.

---

సినిమా మొదట్లోనే డైరెక్ట్‌గా మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది.

ఒక తండ్రి… తన కూతురికి లివర్‌కు సంబంధించిన ప్రాణాంతక వ్యాధి రావడంతో చికిత్స కోసం చేతిలో ఉన్న మొత్తం బంగారం తీసుకుని ఊరి నుంచి నగరానికి రైలులో వస్తారు.

రైలు దిగి ఆటో ఎక్కుతుండగా… దొంగలు వచ్చి ఆ నగలను దోచుకెళ్తారు.

పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే… మొదట తండ్రి, కూతురిపైనే అనుమానం పడతారు.

కానీ వాళ్లు పోయింది అరవై   సవరాల  బంగారం అని చెప్పడంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేసి మరుసటి రోజు రౌడీలను విచారించి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటారు.

కానీ ఆ బంగారం తిరిగి పొందాలంటే కోర్టు అనుమతి అవసరం అని చెబుతారు.

ఏం చేయాలో తెలియక తండ్రి, కూతురు ఇబ్బంది పడుతున్న సమయంలో

ఒక కానిస్టేబుల్ తనకి తెలిసిన ఓ లాయర్ నెంబర్ ఇచ్చి “ఆయన మీ కేసు టేకప్ చేసి కోర్టు ద్వారా మీ బంగారం మీకే ఇప్పిస్తాడు” అని చెబుతాడు.

వాళ్లు ఆ లాయర్‌ని కలుస్తారు.

‘రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ’ కేసు ఫైల్ చేసి తమ బంగారం తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటారు.

కానీ కేసు టేకప్ చేసిన లాయర్… వాళ్లకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి నుంచి రకరకాలుగా డబ్బులు దోచుకోవడం మొదలుపెడతాడు.

కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తాడు.

ఆ సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి.

కోర్టులో కేసు అంటూ లాయర్ దగ్గరికి వెళ్తే… సగం ఆస్తి కరిగిపోయే వరకు డబ్బులు తీసుకుంటారే కానీ న్యాయం మాత్రం అంత ఈజీగా దొరకదని.

నేను చాలామంది చెప్పడం విన్నాను.

నాలుగు నెలల పాటు కేసు నడిచి… లాయర్‌కు బిర్యానీ నుంచి ప్రతి ఖర్చు పెట్టి

నాలుగు లక్షలకు పైగా డబ్బులు ఖర్చవుతాయి.

చివరకు తండ్రికి ఓపిక నశించి…

కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు స్వామిని (సూర్య) వేడుకుంటాడు.

ఆ తర్వాత ఏమైందో సినిమా చూసి తెలుసుకోవాలి.

---

నాకు కోర్ట్ డ్రామాలు అంటే చాలా ఇష్టం.

ఇప్పటివరకు చాలా తక్కువ కోర్ట్ డ్రామా సినిమాలే చూశాను.

అందులో ఈ సినిమా… న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపించడం నచ్చింది.

డబ్బులు ఉన్నవాడికే ‘న్యాయం’ జరుగుతున్న రోజులివి.

సామాన్యుడు కోర్టుని ఆశ్రయిస్తే… ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదు.

అప్పటికీ సరైన న్యాయం జరుగుతుందా అంటే అనుమానమే.

న్యాయవ్యవస్థలో ఉన్న అవినీతిని, సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని దర్శకుడు ఆర్‌.జే బాలాజీ బాగా చూపించాడు.

అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు.

థ్రిల్ గానీ… ఎమోషన్ గానీ పెద్దగా అనిపించలేదు.

ఫస్టాఫ్‌లో ఎమోషన్ మీద ఫోకస్ పెట్టిన దర్శకుడు…

సెకండాఫ్‌లో మాత్రం మాస్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ దృష్టిపెట్టాడు.

ఓవరాల్‌గా చూస్తే…

మంచి ఎమోషనల్ ఫస్టాఫ్,

బలహీనమైన సెకండాఫ్ ఉన్న అబౌవ్ యావరేజ్ సినిమా ‘వీరభద్రుడు’ అనిపించింది.

సినిమా అయిపోయాక ఇంటికి వచ్చి… అమ్మ ఇంట్లో చేసిన ఇడ్లీ తిని పడుకున్నాను.

---

నిన్న సెలవు కావడంతో బయటకి వెళ్లే పని ఏమీ లేక ఇంట్లోనే ఉన్నాను.

సరిగ్గా ఉదయం పదకొండు గంటల సమయంలో వరుసగా మూడో రోజు

ప్రతి సాయంత్రం నాకు కాల్ చేస్తున్న ఆ అమ్మాయి మళ్లీ కాల్ చేసింది.

ఈసారి తనతో మాట్లాడడం కుదిరింది.

“నువ్వు ఎలా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటావు?

ఎలా ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ అవుతున్నావు?” అని అడిగింది.

ఆ ప్రశ్న విన్నాక…

తనకి ఏదో సమస్య ఉన్నట్టు అనిపించింది.

ఒకపక్క ఆరోగ్యం బాగోలేక… ఇంకోపక్క మానసికంగా కూడా తను ఇబ్బంది పడుతున్నట్టు అర్థమైంది.

తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలుపెట్టాను.

పైకి చూడడానికి నా లైఫ్ బాగానే కనిపించొచ్చు.

కానీ నాకు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం ఇబ్బందులే.

అది ఇంట్లో అయినా… పని చేసే చోటైనా.

కానీ ఎలాగో అలా… ఎదురయ్యే ఇబ్బందులను ఓవర్‌కమ్ అవుతున్నాను.

“ఎందుకు మనుషులకు ఇన్ని కష్టాలు?

నిమ్మది లేని జీవితం ఎందుకు?” అని తను అడిగింది.

దానికి నేను…

“మనిషి జన్మ అంటేనే అంతే.

అందుకే ఈ సృష్టిలో మానవ జన్మ ఉండకూడదు అని నేను చెబుతూ ఉంటాను” అని చెప్పాను.

అలా మేము కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాం.

ఆ తర్వాత… చివరగా నేను బ్లాగ్ రాసి వారం పైనే అవడంతో

‘వీరభద్రుడు’ సినిమా గురించి రాయాలనిపించినా రాయడానికి మోటివేషన్ లేదు.

చేసేదేమీ లేక… చివరికి రోజంతా యూట్యూబ్ చూస్తూ గడిపేశాను.

— తిరుపతి మహేష్

18/05/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?