పెళ్లికి లక్షల్లో ఖర్చు పెడుతారు… కానీ కుటుంబం కోసం 500 రూపాయల ఇన్సూరెన్స్ మాత్రం భారంగా...

రెండురోజుల క్రితం తిరుపతిలోనే నాకు తెలిసినవారి ఒక పెళ్లికి నేను అటెండ్ అయ్యాను.

చాలా రోజుల తర్వాత మనసులో నిలిచిపోయే పెళ్లికి వెళ్లిన తృప్తి నాకు కలిగింది.

అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు.

డబ్బులకు అమ్మాయి వైపు కానీ, అబ్బాయి వైపు కానీ ఎలాంటి లోటు లేదు. అనుకుని ఉంటే పెద్ద పెళ్లి మండపం బుక్ చేసి,

డెకరేషన్‌కే లక్షలు ఖర్చు పెట్టి, ఒకరోజు కోసం లక్షల్లో ఖర్చు పెట్టి “మేము కూడా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాం” అని చూపించుకునే స్థోమత ఉన్నవాళ్లే.

కానీ అలా చేయకుండా, సింపుల్‌గా ఒక చిన్న హాల్ సెలెక్ట్ చేసుకుని పెళ్లి జరిపించారు.

అది నాకు చాలా బాగా నచ్చిన విషయం.

గత పది, పదిహేను సంవత్సరాలుగా పెళ్లి అంటే గ్రాండ్‌గా చేయాలనే ఆలోచన ఎక్కువైపోయింది.

డబ్బులు లేకపోయినా పర్సనల్ లోన్స్ తీసుకుని, రెండు రూపాయల వడ్డీ, మూడు రూపాయల వడ్డీకి అప్పులు చేసి

పెళ్లిళ్లు చేసిన కథలు ఎన్నో నాకు తెలుసు.

ఆ అప్పులు తీర్చడానికే వాళ్లు పడే తంటాలు కూడా నాకు తెలుసు.

నిన్న ఉదయం బ్యాంకులో ఒక వ్యక్తిని కలిశాను. తన కొడుకి పెళ్లికి నాలుగేళ్ల క్రితం 15 లక్షలు ఖర్చు పెట్టారట.

ఇప్పటికీ ఆ అప్పు పూర్తిగా తీరలేదని చాలా బాధతో చెప్పారు.

డబ్బు ఉన్నవాళ్లు వారి సొంత డబ్బుతో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా ఎలాంటి సమస్య లేదు.

కానీ చాలామంది ఇంకొకరి డబ్బుతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవడంలో ఏం ఆనందం ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

Mukesh Ambani తన రెండో కొడుకు పెళ్లిని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఎంత గ్రాండ్‌గా చేశారో అందరికీ తెలుసు.

అదే సమయంలో Tata Group కుటుంబంలో కూడా ఒక పెళ్లి జరిగింది.

ఆ పెళ్లి చాలా సింపుల్‌గా, ఇంట్లోనే అనవసరమైన ఆర్భాటాలు లేకుండా జరిగింది.

అంబానీకి… టాటాలకు… ఆలోచనలో ఎంత తేడా ఉందో చూడండి.

వేయిమందికి పత్రికలు కొట్టి, పెద్ద పెద్ద మండపాల్లో పెళ్లి చేసే వాళ్లలో చాలామంది

సొసైటీలో తమ స్టేటస్ చూపించుకోవడానికే లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనిపిస్తుంది.

ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది?

అనేది కొంచెం లోతుగా చూస్తే అసలు కథ అర్థమవుతుంది.

పెళ్లి సంగతి పక్కనపెట్టి… ఇన్సూరెన్స్ విషయానికి వస్తే…...

---

మన ఊర్లలో ఇప్పటికీ “ఇన్సూరెన్స్” అంటే ఏదో చెడు విషయం అన్నట్టుగా చాలామంది చూస్తుంటారు.

“మనకి ఏమీ కాదు” అనే ధైర్యమో, నిర్లక్ష్యమో… ఏమో నాకు తెలియదు.

నాకు కూడా ఒకప్పుడు ఇన్సూరెన్స్ విలువ తెలియదు.

2022 జూన్‌లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, అతను బ్రతికున్నప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్ అతని మరణం తర్వాత ఆ కుటుంబానికి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు ఎంత ధైర్యం ఇచ్చిందో దగ్గరగా చూసాక అప్పటి నుంచి ఇన్సూరెన్స్ మీద నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

ఇన్సూరెన్స్‌లో చాలా రకాలుంటాయి.

టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్… ఇలా చెప్పుకుంటూ పోతే

దాదాపు అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది.

మన దేశంలో ఏదైనా రెండు చక్రాల వాహనం కానీ, నాలుగు చక్రాల వాహనం కానీ కొంటే షోరూమ్ వాళ్లే “ఇన్సూరెన్స్ తప్పనిసరి” అని వేస్తారు.

రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు పోలీసులు కూడా చెక్ చేస్తారు.

కానీ అదే మనిషికి ఇన్సూరెన్స్ తీసుకోమంటే సగానికి పైగా మంది వద్దంటారు.

ఉన్నప్పుడు విలువ తెలియదు.

కానీ ఒకసారి కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తి అటాతుటగా చనిపోతే, ఆ కుటుంబ పరిస్థితి ఎలా మారుతుందో

ఒక్కరూ ఆలోచించడం లేదు.

డబ్బు ఉంటే ఆ కుటుంబం ఎవరి మీదా ఆధారపడకుండా జీవించగలదు.

లేకపోతే నరకమే.

---

2015 మే 9న భారతదేశ ప్రధానమంత్రి Narendra Modi కటిక పేదరికంలో ఉన్నవారికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ప్రారంభించిన రెండు ఇన్సూరెన్స్ పథకాలు — ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY),

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY).

ఈ రెండు ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాల గురించి విని, ఇప్పటికే ఇందులో ఎంతమంది చేరి ఉన్నారో నాకు తెలియదు.

మీరు ఇప్పటివరకు ఈ రెండు స్కీముల్లో చేరకపోతే, మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకి వెళ్లి ఈ రెండింటిలో చేరండి.

PMSBY స్కీమ్‌లో సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది.

18 నుంచి 70 సంవత్సరాల వయసున్నవారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

ఇక్కడ యాక్సిడెంట్ అంటే రోడ్ ప్రమాదం మాత్రమే కాదు.

కరెంట్ షాక్, ఫైర్ యాక్సిడెంట్, పాము కాటు… ఇలా ఆరోగ్య సమస్యలు లేదా ఆత్మహత్య తప్ప ఏదైనా ప్రమాద కారణంగా మరణిస్తే

PMSBY స్కీమ్‌లో ఉంటే నామినీకి 2 లక్షలు వస్తాయి.

---

అదే PMJJBY స్కీమ్‌లో 18 నుంచి 50 సంవత్సరాల వయసు లోపు ఉన్నవారు మాత్రమే చేరాలి.

55 ఏళ్ల వరకు కవరేజ్ కొనసాగుతుంది.

ఈ స్కీమ్ ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు.

ఈ స్కీమ్‌లో ఉన్న వ్యక్తి అనారోగ్యంతో చనిపోయినా, యాక్సిడెంట్ వల్ల చనిపోయినా నామినీకి 2 లక్షల కవరేజ్ వస్తుంది.

సంవత్సరానికి 500 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో పై చెప్పిన రెండు ప్రధాన్ మంత్రి ఇన్సూరెన్స్ పాలసీలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కోట్లాది కుటుంబాలకు ఉపయోగపడతాయని నమ్మితే, మీకు తెలిసినవారికి కూడా చెప్పండి.

 ప్రతి ఒక్కరూ ఈ పాలసీలు తీసుకుని,

“మన తర్వాత కూడా మన కుటుంబం ఆర్థికంగా నిలబడాలి” అనుకుంటే

ఖచ్చితంగా వీటిలో చేరండి.

ఇవి కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి.

వాటికి వారి ఆదాయం, ఆరోగ్య పరిస్థితిని చూసి పాలసీ ఇవ్వడం జరుగుతుంది.

కానీ ఈ ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలకు అలాంటి కండిషన్స్ ఏమి లేవు.

ఇప్పుడు సడన్‌గా ఇన్సూరెన్స్ విషయం ఎందుకు గుర్తొచ్చిందంటే…

నిన్న బ్యాంకులో కనీసం పదిమంది అయినా వచ్చి “సార్… శనివారం నా అకౌంట్‌లో డబ్బులు కట్ అయ్యాయి. ఎందుకు?” అని అడిగారు.

ఆ డబ్బులు ఈ ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) రెన్యువల్ కోసం కట్ అయ్యాయని చెప్పాను.

నాకు కూడా ఆ డబ్బులు కట్ అయిన విషయం కస్టమర్లు వచ్చి అడిగితేనే తెలిసింది :)

అందులో కొంతమంది కస్టమర్లకు ఇన్సూరెన్స్ కోసం కట్ అయ్యిందని చెప్పగానే,

“ఇన్సూరెన్స్ మాకు ఏమి అవసరం లేదు… అనవసరమైన ఖర్చు… ఈ పాలసీలు క్యాన్సిల్ చేసుకోవచ్చా?” అని అడగడం చూసి,

మనసులో మనుషులు మారరేమో అనుకున్నాను.

— తిరుపతి మహేష్

12/05/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న