మనసుతో పనిచేసిన మనిషి
ఈరోజు నేను పని చేస్తున్న మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి గారు సూపర్ అన్న్యువేషన్ ద్వారా రిటైర్ అవుతున్నారు.
2011 జూన్ 1 నుంచి ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ, తాటిపత్రి మెయిన్ బ్రాంచ్, శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్, ప్రస్తుతం నేను పనిచేస్తున్న మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లలో సేవలందించారు. మొత్తం చూస్తే, దాదాపు 15 సంవత్సరాలకు 2 నెలలు తక్కువగా ఎస్బీఐలో పని చేసి ఈరోజు సూపర్ అన్న్యువేషన్ ద్వారా రిటైర్ అవుతున్నారు.
నేను 2022 జూలై 2న మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో రిపోర్ట్ చేసినప్పటికీ, అప్పటికే సర్ అక్కడ పనిచేస్తున్నారు. మొదట్లో నేను కూర్చున్న కౌంటర్ వరుస కౌంటర్ల మధ్యలో ఉండటం వల్ల, సర్‌తో ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం రాలేదు.
కానీ 2023 జూన్‌లో వెంకట లక్ష్మి గారు (డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్) వచ్చిన తర్వాత నా కౌంటర్‌ను బ్రాంచ్ ఎంట్రన్స్ దగ్గరికి మార్చారు. అప్పటి నుంచి మేము క్రమంగా మాట్లాడుకోవడం ప్రారంభమైంది.
2024 జూన్ నుంచి నేను రాపిడో ద్వారా ఇంటి నుంచి బ్యాంక్‌కి, బ్యాంక్ నుంచి ఇంటికి ప్రయాణం ప్రారంభించిన తర్వాత, ప్రతి రోజు ఉదయం నేను బ్యాంక్‌కు వచ్చినప్పటి నుంచి నన్ను లోపలికి తీసుకెళ్లడం నుండి, సాయంత్రం నేను ఇంటికి వెళ్లే వరకు నన్ను బైక్ ఎక్కించే వరకు రోజంతా మధ్యలో పని సమయంలో నాకు అవసరం వచ్చినప్పుడల్లా సహాయం చేస్తూ, ఒక మంచి సపోర్టింగ్ పర్సన్‌గా ఉండేవారు.
సర్‌తో మాట్లాడితే ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఆయన చాలా టాలెంటెడ్ వ్యక్తి. చిన్నప్పుడే సరైన గైడెన్స్ ఉంటే, ఖచ్చితంగా ఒక ప్రభుత్వ టీచర్‌గా రిటైర్ అయ్యేవారు అనిపిస్తుంది.
1982లో తన గ్రామంలో పదో తరగతి పూర్తిచేసి, ఇంటర్మీడియట్ కొంతకాలం చదివారు. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అవడంతో భయపడి, 1984లో ఒంటరిగా తిరుపతికి వచ్చి చిన్న చిన్న పనులు చేశారు. చివరకు 1985 మేలో ఆర్మీలో చేరారు.
17 సంవత్సరాలు మిలిటరీలో సేవలందించి, 2002 మేలో తిరిగి తిరుపతికి వచ్చారు. అప్పటికే ఆయనకు పెళ్లి అయి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత, 2002 నుంచి 2011 వరకు 9 సంవత్సరాలు టిటిడిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశారు. తర్వాత ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డ్‌గా ఎంపికై 2011 జూన్‌లో జాయిన్ అయ్యారు.
చేతిలో ఏమీ లేకుండా 1984లో తిరుపతికి వచ్చిన సుధాకర్ రెడ్డి సర్ జీవితం, ఈరోజు చూస్తే కష్టాన్ని నమ్ముకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి ఎదిగిన ఆయన జీవితం ఒక గొప్ప ప్రేరణగా కనిపిస్తుంది.
ఆయన ఇద్దరు కుమారులు కూడా చదువులో బాగా చదివి జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నారు.
సుధాకర్ రెడ్డి సర్‌తో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఒక తండ్రిగా తన పిల్లలను చూసుకునే
విధానం నాకు చాలా నచ్చింది.
ఇన్ని రోజులు బ్యాంక్‌లో తన పని మాత్రమే కాకుండా, ఇతర పనుల్లో కూడా ముందుండి సహాయం చేసేవారు. ఇప్పుడు ఆయన రిటైర్ అవ్వడంతో, రేపటి నుంచి బ్రాంచ్‌లో ఆయన లేని లోటు ఖచ్చితంగా తెలుస్తుంది.
రాబోయే రోజుల్లో మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌కి కొత్త సెక్యూరిటీ గార్డ్ వచ్చినా, సుధాకర్ రెడ్డి సర్‌తో నాకు ఏర్పడిన ఆ అనుబంధం, ఆ వేవ్ లెంగ్త్ ఇతరులతో ఎంతవరకు ఏర్పడుతుందో తెలియదు.
ఈరోజు 60 సంవత్సరాలు పూర్తిచేసుకుని సూపర్ అన్న్యువేషన్ ద్వారా రిటైర్ అవుతున్న వళ్లివేడు సుధాకర్ రెడ్డి గారికి నా మనస్పూర్తిగా శుభాకాంక్షలు.
Wishing you a happy, healthy, and peaceful retirement life, Sir.
Your support and kindness meant a lot to me.
You will truly be missed.
---
– తిరుపతి మహేష్
31/03/2026
Comments
Post a Comment