బయటికి కనిపించని మానసిక పోరాటం

చాలామంది, అందులో నేనూ కూడా ఒకడిని, డిప్రెషన్, స్ట్రెస్, ఆందోళన (Anxiety) మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాము.

మానసికంగా కొంచెం బరువుగా అనిపించినా, లేదా జీవితంలో ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినా, వెంటనే అది డిప్రెషన్, స్ట్రెస్ లేదా ఆందోళన అని అనుకుంటాం.

అసలు వాటి అర్థం పూర్తిగా తెలుసుకోకుండా ఈ మూడు పదాలను చాలా సార్లు ఉపయోగిస్తుంటాం.

కానీ నిన్న, నేను ఒక ఫేస్‌బుక్ స్టేటస్ చదివిన తర్వాత, డిప్రెషన్, స్ట్రెస్, ఆందోళన మధ్య ఉన్న తేడా నాకు స్పష్టంగా అర్థమైంది.

నాలాగే మీరూ కూడా ఈ మూడింటికి ఉన్న తేడాను తెలుసుకోవాలని ఈ బ్లాగ్ రాస్తున్నాను.

***

మనము ఎప్పటికప్పుడు గతం గురించే ఆలోచిస్తూ, ఆ ఆలోచనల నుంచి మన మనసును దూరం చేయలేకపోతే, దానిని డిప్రెషన్ అంటారు.

మన ప్రస్తుత పరిస్థితి గురించి, ఇప్పుడున్న సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే, దానిని స్ట్రెస్ అంటారు.

మన ఆలోచనలు మొత్తం భవిష్యత్తు గురించే ఉండి, ఏమవుతుందో అని ముందుగానే ఆందోళన పడుతూ, భయపడుతూ ఉంటే, దానిని ఆందోళన (Anxiety) అంటారు.

***

ఈ మూడు సమస్యలతో పాటు, ట్రామా, భావోద్వేగ బాధ, ఇంకా కనిపించని ఎన్నో మానసిక కలవరాలు కూడా ఉంటాయి.

ఇవి ఇతరులకు కనిపించని సమస్యలు.

ఆ బాధను అనుభవిస్తున్న వ్యక్తికే నిజంగా తాను ఏమి ఎదుర్కొంటున్నాడో తెలుస్తుంది.

కొన్నిసార్లు ఒక వ్యక్తి బయటికి చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, సంపూర్ణంగా కనిపించవచ్చు.

వారు తమ పని సరిగ్గా చేస్తూ, సాధారణంగా జీవితం కొనసాగిస్తున్నట్టుగా కనిపించవచ్చు.

కానీ అందువల్ల వారు లోపల మానసికంగా ప్రశాంతంగా ఉన్నారని అర్థం కాదు.

***

ఉదాహరణకి నన్నే తీసుకోండి. అందరిలాగా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి రావడం, నా పనులను నేనే చేసుకోవడం, కుదిరినప్పుడు నచ్చిన చోటికి విహారయాత్రలకు వెళ్లి రావడం — ఇవన్నీ చూసి కొంతమంది నన్ను లోలోపల ఈర్ష్యపడుతూ, నన్ను చూసి కుళ్ళుకుంటారు.

నాకు ఏదో అదృష్ట దేవత సహాయం చేస్తున్నట్టుగా తమలో తామే ఊహించుకుంటారు.

నిజం చెప్పాలంటే, ప్రతిరోజు ఉదయం లేవడం నుంచి రాత్రి కళ్ళు మూసి నిద్రపోయే వరకు నేను బ్రతకడానికి ఎంత పోరాటం చేస్తానో, కాస్త కళ్ళు మూసుకుని మనసుపెట్టి ఆలోచిస్తే అర్థం అవుతుంది.

కానీ అలా ఎవరూ చేయరు.

బయటి వాళ్లు, బంధువులు వాళ్ల సంగతి పక్కన పెడితే, నా ఇంట్లో నా తల్లిదండ్రులే అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఏమి చెప్పాలి.

చాలా సార్లు మనం మన కళ్లతో కనిపించేదాని ఆధారంగా మాత్రమే ఇతరులను అంచనా వేస్తాం.

కానీ ఈ అలవాటు మారాలి.

ఎందుకంటే మానసిక పోరాటాలు బయటికి కనిపించవు.

నవ్వుతున్న ముఖం అంటే ఆ మనసు ప్రశాంతంగా ఉందని ఎప్పుడూ అర్థం కాదు.

కొన్నిసార్లు బయటికి చాలా బలంగా కనిపించే వ్యక్తి, లోపల అత్యంత పెద్ద పోరాటం చేస్తూ ఉండవచ్చు.

కాబట్టి ఎవరినైనా అంచనా వేయడానికి ముందు, కొంచెం దయతో ఉండడం, ఓపికగా ఉండడం, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

ప్రతి గాయం కళ్లకు కనిపించదు.

కొన్ని లోతైన పోరాటాలు మనసులోనే నిశ్శబ్దంగా జరుగుతుంటాయి.

---

తిరుపతి మహేష్

11/03/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం