ఒక అనుకోని పరామర్శ
ఏమిటో కానీ, ప్రతి సోమవారం ఉదయం నిద్ర లేవగానే త్వరగా వీకెండ్ వచ్చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.
అలాగే వీకెండ్ వచ్చినప్పుడు పనులేమీ లేకపోతే, మళ్లీ బ్యాంక్ ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది.
ఈ రోజు రెండో శనివారం — బ్యాంక్ హాలిడే.
నిన్న నుంచే ఈ రెండు రోజులు శని–ఆదివారం ఏమి చేయాలి అని ఆలోచన నా లోపల మొదలైంది.
మొదట్లో బెంగళూరుకు వెళ్లాలని అనుకున్నాను.
కానీ అది కుదరలేదు.
కనీసం శణ్ముగం వస్తాడేమో అనుకున్నాను.
కానీ శణ్ముగం తల్లిదండ్రులు అతని దగ్గరకు వెళ్లారట.
అందువల్ల ఈ వారం శణ్ముగం తిరుపతికి రాడని తెలిసిపోయింది.
చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏవీ రిలీజ్ కాలేదు.
ఈ రోజు ఉదయం లేవగానే “ఏం చేద్దాం?” అని ఆలోచిస్తూ ఉండగా, చాలా రోజులుగా వెళ్లాలి అనుకుంటున్న మునిరత్నం సర్ ఇంటికి వెళ్లాలి అని అనిపించింది.
టిఫిన్ తిన్నాక ఒకసారి కాల్ చేసి, రాపిడోలో మునిరత్నం సర్ ఇంటికి వెళ్లాలని అనుకున్నాను.
టైమ్ చూసుకుంటే తొమ్మిది అవుతోంది.
ఒకసారి సర్‌కు కాల్ చేసి “నేను ఇంటికి వస్తున్నాను” అని చెప్పాలని కాల్ చేశాను.
పూర్తిగా రింగ్ వెళ్లింది కానీ సర్ కాల్ లిఫ్ట్ చేయలేదు.
కొద్దిసేపటికి సర్ నంబర్ నుండి తిరిగి కాల్ వచ్చింది.
నేను కాల్ లిఫ్ట్ చేసి “హలో” అన్నాను.
కానీ మాట్లాడింది మునిరత్నం సర్ భార్యగారు.
రెండు వారాల క్రితం సర్‌కు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని మేడమ్ చెప్పారు.
అది విన్నాక ఒక్కసారిగా ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.
సర్‌ను ఏ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారో అడిగి తెలుసుకుని,
“సర్‌ను చూడడానికి వస్తున్నాను మేడమ్” అని చెప్పి కాల్ కట్ చేశాను.
స్నానం చేసి ఇంట్లో అమ్మ చేసిన పొంగల్–చట్నీ తిన్నాను.
ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లడానికి నాతో పాటు ఎవరు వస్తారో అని ఆలోచించాను.
బ్యాంక్ కంప్యూటర్ ఇంజనీర్ రవీ అన్నకు కాల్ చేశాను.
“నేను SVIMS హాస్పిటల్ వరకు వెళ్లి రావాలి. కుదిరితే నాతో వస్తావా?” అని అడిగాను.
అతను “సరే” అన్నాడు.
పది గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకుని మేమిద్దరం కలిసి మునిరత్నం సర్‌ను చూడడానికి SVIMS హాస్పిటల్‌కు వెళ్లాము.
ఇది నేను SVIMS హాస్పిటల్‌కు రెండోసారి వెళ్లడం.
మొదటిసారి గత సంవత్సరం జనవరిలో మా వదిన నాన్న శంకర్ రెడ్డి గారు అక్కడ అడ్మిట్ అయినప్పుడు, ఆయనను చూడడానికి నా బాబాయి కొడుకు వాసు నన్ను తీసుకెళ్లాడు.
ఆ తర్వాత ఈ రోజు రెండోసారి SVIMS హాస్పిటల్‌కు వెళ్లాను.
మునిరత్నం సర్ ఉన్న రూమ్‌కు వెళ్లాము.
సర్ బెడ్ మీద పడుకుని ఉన్నారు.
కాళ్లకు బ్యాండేజ్ వేసి ఉంది.
మూత్రం వెళ్లేందుకు బ్యాగ్ కూడా పెట్టి ఉంది.
సడన్‌గా సర్‌కు ఏమి జరిగిందో మేడమ్‌ను అడిగి తెలుసుకున్నాను.
ఇంతకుముందు కూడా సర్‌కు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి.
కానీ నాకు సర్ పరిచయం అయిన తర్వాత ఇంత పెద్దగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
***
2015 ఏప్రిల్ 10. SV యూనివర్సిటీలో మా MA English Literature రెండో సంవత్సరం.
ఆ రోజు మా లాస్ట్ కాలేజ్ డే.
ఆ తర్వాత ప్రిపరేషన్ సెలవులు మరియు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.
క్లాస్ చివరి రోజు కావడంతో అందరూ ఒకరితో ఒకరు వీడ్కోలు చెప్పుకుని హాస్టల్‌కు లేదా తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
నేను మాత్రం నా నాన్న కోసం వేచి చూస్తున్నాను.
అప్పుడు ఒక వ్యక్తి వచ్చి “మీ డిపార్ట్‌మెంట్‌లో కుమార్ అనే వ్యక్తి మీకు తెలుసా?” అని అడిగాడు.
“తెలుసు” అని చెప్పాను.
“అతనితో ఏమైనా పని ఉందా?” అని అడిగాను.
అప్పుడు అతను చెప్పాడు —
SV యూనివర్సిటీ రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ మునిరత్నం సర్
కుమార్ నంబర్ తీసుకురమ్మని చెప్పారు అని.
“ఎందుకు కుమార్ నంబర్ కావాలి?” అని అడిగితే మునిరత్నం సర్ విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తి.
ఆయనకు కంప్యూటర్ నేర్చుకోవాలనే కోరిక ఉంది.
నా జూనియర్ కుమార్ laptop వాడటం చూసి,
“యూనివర్సిటీలో ఒక బ్లైండ్ అబ్బాయి laptop వాడుతున్నాడు” అని ఎవరో సర్‌కు చెప్పారట.
అందుకే మునిరత్నం సర్ కుమార్ నంబర్ తెప్పించమని ఒకరిని పంపించారు.
ఆ వ్యక్తి మా క్లాస్‌రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అడిగాడు.
కుమార్ నంబర్ ఇవ్వకుండా నా నంబర్ ఇచ్చి
“కుమార్‌కు బదులుగా నాకు కాల్ చేయండి” అని చెప్పాను.
అలా 2015 ఏప్రిల్ 10 — నా PG చివరి రోజున మునిరత్నం సర్‌తో నా పరిచయం ప్రారంభమైంది.
ఆ సమయంలో సర్ వయస్సు 67 సంవత్సరాలు.
నా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాక నేను సర్ ఇంటికి వెళ్లి కొన్ని రోజులు కంప్యూటర్ నేర్పించడం ప్రారంభించాను.
ఆ తర్వాత సర్ laptop వాడడం నేర్చుకుని, ఎవరి సహాయం లేకుండా స్వయంగా కథలు రాయడం మొదలుపెట్టారు.
అలాగే తన స్వీయచరిత్రను (Autobiography) కూడా రాయడం ప్రారంభించారు.
***
జక్కంపూడి మునిరత్నం సర్ 1948 జనవరిలో ప్రస్తుత తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో ఉన్న తిరువాలంగాడు అనే ఊరికి దగ్గరలోని ఒక గ్రామంలో జన్మించారు.
పుట్టుకతోనే విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా, ఆయన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం చాలా పెద్దది అని సర్ ఎప్పుడూ చెప్పేవారు.
అందువల్ల ఆయనకు తెలుగు మరియు తమిళ సాహిత్యంపై మంచి ఆసక్తి కలిగింది.
తిరుపతిలో BA, MA మరియు PhD పూర్తి చేసి, 1989 ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా చేరారు.
దాదాపు 20 సంవత్సరాల పాటు తన ప్రతిభ మరియు అంకితభావంతో యూనివర్సిటీలో మంచి గుర్తింపు పొందారు.
2008లో రిటైర్ అయిన తరువాత కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా కొన్ని రోజులు గెస్ట్ లెక్చరర్‌గా పనిచేశారు.
2012 ప్రాంతంలో ఆయన అన్న కొడుకు అమెరికా నుంచి ఒక laptop తీసుకువచ్చి ఇచ్చాడు.
కానీ దాన్ని ఎలా వాడాలో తెలియక కొంతకాలం అలాగే ఉండిపోయింది.
మూడు సంవత్సరాల తరువాత — 2015 ఏప్రిల్‌లో — నా పరిచయం సర్‌కు కలిగింది.
ఆ తర్వాత సర్ laptop వాడటం నేర్చుకుని కథలు రాయడం మొదలుపెట్టారు.
గత సంవత్సరం డిసెంబర్‌లో తమిళనాడు గవర్నర్ చేతుల మీదుగా ఒక అవార్డు కూడా అందుకున్నారు.
సర్ తన జీవిత చరిత్రను దాదాపు పూర్తిగా రాసేశారు.
కొన్ని చిన్న సవరణల కోసం మాత్రమే పెండింగ్‌లో ఉంది.
సర్‌తో నేను ఎప్పుడూ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్తూ ఉండేవాడిని —
“మన గురించి మనమే ఈ ప్రపంచానికి చెప్పాలి.
మీ స్వీయచరిత్రను ఒక పుస్తకంగా తీసుకురావాలి సర్” అని.
కానీ ఇంతలో సడన్‌గా సర్ ఆరోగ్యం బాగాలేదని తెలుసుకోవడం నాకు చాలా బాధ కలిగించింది.
సర్ ఎక్కువ సేపు మాట్లాడలేరని మేడమ్ చెప్పారు.
“ఏమండి, మహేష్ మిమ్మల్ని చూడడానికి వచ్చాడు” అని మేడమ్ చెప్పగానే
సర్ నా పేరు పలికారు.
నేను ఆయన చేతిని పట్టుకుని
“ఏమీ కాదు సర్. భయపడకండి. త్వరలో ఇంటికి వస్తారు.
మీ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని ప్రింటింగ్‌కు ఇచ్చి ప్రచురిద్దాం” అని చెప్పాను.
సర్ కూడా అంగీకరించినట్లు మెల్లగా “సరే” అన్నారు.
ఆ తర్వాత నాకు ఏమి మాట్లాడాలో తెలియక మేడమ్‌తో మాట్లాడుతుండగా,
అకస్మాత్తుగా సర్ నన్ను పిలిచి
“ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నావు?” అని అడిగారు.
సర్‌కు పుస్తకాలు అంటే చాలా ఇష్టం.
నేను ఆయనతో మాట్లాడిన ప్రతిసారీ ఇదే ప్రశ్న అడిగేవారు.
ఈ రోజు కూడా హాస్పిటల్‌లో అదే ప్రశ్న అడుగుతారని అసలు ఊహించలేదు.
అప్పుడు నేను చెప్పాను —
“ఈ రోజు నాకు బ్యాంక్ సెలవు. మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి రావాలని అనుకున్నాను.
ఇప్పుడు నేను తెలుగులో బ్లాగులు రాయడం ప్రారంభించాను.
వాటిని మీకు చూపించాలని అనుకున్నాను” అని.
అప్పుడు సర్ మెల్లగా
“చాలా మంచి పని చేస్తున్నావు” అన్నారు.
“మీరు త్వరగా కోలుకుని ఇంటికి రండి.
నేను రాసిన బ్లాగులు మీకు చూపిస్తాను” అని చెప్పాను.
ఆ తర్వాత కొద్దిసేపు మేడమ్‌తో మాట్లాడి రూమ్ నుంచి బయటికి వచ్చాను.
సర్ గురించి మరియు సర్‌తో నాకు ఉన్న 11 సంవత్సరాల పరిచయం గురించి రవి అన్నతో మాట్లాడుతూ ఇంటి వరకు వచ్చాము.
ఇంటికి చేరుకున్న తర్వాత రవి అన్న నన్ను ఇంటి వద్ద దింపి తన ఇంటికి వెళ్లిపోయాడు.
---
తిరుపతి మహేష్
14/03/2026
Comments
Post a Comment