మౌనంగా చూస్తున్న సమాజం
ఒక వ్యక్తి తప్పు చేసి శిక్ష పడి పది సంవత్సరాలు జైల్లో గడిపి విడుదల అవుతాడు అనుకుందాం.
విడుదలైన తర్వాత అతను చేసిన తప్పుకు ఎంతవరకు పశ్చాత్తాపం పడతాడు? శిక్షను అనుభవించిన తరువాత అతని ఆలోచనల్లో, ప్రవర్తనలో ఎంతవరకు మార్పు వస్తుందో మాత్రం చెప్పడం కష్టం.
అయితే అదే వ్యక్తి చేసిన తప్పును సమాజంలో నలుగురు వేలెత్తి చూపించి, “నువ్వు తప్పు చేశావు” అని చికొట్టి నిలదీస్తే — అతనిలో ఏదైనా చలనం కలగవచ్చు. ఆ వ్యక్తిలో కొంతైనా మార్పు చోటుచేసుకునే అవకాశం ఉండవచ్చు.
ఇప్పుడు నేను చెప్పింది ఏదో నా సొంత ఆలోచనతో చెప్పిన ఉపన్యాసం కాదు. కొద్ది రోజుల క్రితం గరికపాటి గారు చెప్పిన మాటలు ఇవి.
ప్రస్తుతం నా చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. వారు చేసిన, చేస్తున్న తప్పు నా చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. కానీ ఎవరూ నోరు తెరచి “నువ్వు చేస్తున్నది తప్పు” అని ఏ ఒక్కరూ చెప్పడం లేదు.
ఒక వ్యక్తి దొంగతనం చేస్తుంటే, అతనిని “దొంగ” అని చెప్పకుండా, తమ అవసరాల కోసం స్వార్థంగా మౌనంగా చూస్తూ ఉండే వారిని ఏమని పిలవాలి?
“వాడికి కనిపించదు, అంధుడు కదా… మనల్ని ఏమి చేస్తాడులే” అన్నట్టుగా —
మనం చేసే పనులన్నీ సరైనవేనని గర్వం, అహంకారంతో మనిషి రూపంలో ఉన్న మృగాల్లా ప్రవర్తించే వారికి చెప్పడానికి ఏమీలేదు.
మీ మనసాక్షికి తెలుసు — మీరు చేస్తున్నది సరైనదా, తప్పా అని.
ప్రపంచాన్ని మీరు మోసం చేయగలరేమో గానీ, మీ మనసాక్షిని మాత్రం ఎప్పటికీ మోసం చేయలేరు.
“వెలుతురులో ఉండేవాడికి భయం చీకటి అంటే…
అదే చీకటిలోనే ఉన్నవాడికి…?”
---
తిరుపతి మహేష్
04/03/2026
Comments
Post a Comment