నా జీవితం – కనిపించని కథలు


నేను ఇటీవల రాసిన నా బ్లాగ్‌లో, ప్రస్తుతం నా 36 సంవత్సరాల జీవితాన్ని నాలుగు దశలుగా విభజించి, దాన్ని ఒక పుస్తకంగా రాస్తే ఎలా ఉంటుందో అని మీ అభిప్రాయాన్ని అడిగాను.

మీరిలో కొంతమంది మీ అభిప్రాయాలను పంచుకున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

2013 జనవరి నుండి నేను తమిళంలో బ్లాగ్ రాయడం ప్రారంభించాను. ఆ సమయంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యం పొందలేదు. అందుకే చాలా మంది బ్లాగులు చదవడానికి ఆసక్తి చూపేవారు.

ఆ రోజుల్లో నేను రాసే బ్లాగులను ఆరు ఖండాలలో ఉన్న అనేక దేశాల వారు కూడా చదివేవారు.

నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడగకానే సహాయం చేయడానికి ముందుకు వచ్చే మంచి వ్యక్తులతో, బ్లాగ్ రాయడం ద్వారా నాకు ఒక మంచి నెట్‌వర్క్ ఏర్పడింది.

2016 డిసెంబర్‌లో నేను ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే, నా జీతంతో మా ఇంట్లో వాళ్లను టూర్ ఏజెంట్ ద్వారా కాకుండా, సింగపూర్‌లో ఉన్న నాకు పరిచయమైన బ్లాగ్ పాఠకుల సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి, ఐదు రోజుల సింగపూర్ ప్రయాణానికి మా ఇంట్లో వాళ్లను తీసుకెళ్లాను.

తర్వాత 2022 జూన్ నెలలో తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి ప్రాంతంలో, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ శుభ్రం చేస్తున్న మునిసిపల్ కార్మికులు విష వాయువు కారణంగా ప్రమాదంలో చిక్కుకుని సహాయం కోసం అరవడం జరిగింది.

ఆ అరుపులు విని, కొద్దిదూరంలో వాల్ పోస్టర్లు అంటిస్తున్న లక్ష్మణ్ అనే కార్మికుడు, మానవత్వంతో వారిని కాపాడేందుకు వెళ్లాడు. కానీ ఆ డ్రైనేజ్ నుంచి వచ్చిన విషవాయువు కారణంగా మునిసిపల్ కార్మికులతో పాటు అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఇతరులకు సహాయం చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన లక్ష్మణ్ కుటుంబానికి నా వంతు సహాయం చేయాలని అనిపించింది. అందుకే నా బ్లాగ్ ద్వారా ఒక ఫండ్‌రైజింగ్ ప్రారంభించి, పది రోజుల్లోనే ఒక లక్ష రూపాయలను ఆ కుటుంబానికి అందించగలిగాను.

ఇలా నాకు వ్యక్తిగత అవసరాలు వచ్చినప్పుడు అయినా, లేదా నేను ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా, నా బ్లాగ్‌లో ఒక మాట రాసి పోస్ట్ చేస్తే, నన్ను నమ్మి సహాయం చేయడానికి ముందుకు వచ్చే చాలా మంది నాకు బ్లాగ్ రాయడం ద్వారా పరిచయమయ్యారు.

ఈ విధంగా బ్లాగ్ రాయడం వల్ల నాకు ఎన్నో మంచి అనుభవాలు, ప్రయోజనాలు కలిగాయి.

నేను పుట్టింది తిరుపతిలో. నా మాతృభాష తెలుగు అయినప్పటికీ, 12 సంవత్సరాలు చెన్నైలో చదవడం వల్ల దాదాపు 9 సంవత్సరాలు తమిళంలోనే బ్లాగులు రాశాను.

2022 జూన్ చివరి వారంలో తిరుత్తణి నుంచి తిరుపతికి ట్రాన్స్‌ఫర్ రావడంతో, ఇక శాశ్వతంగా తిరుపతిలోనే ఉండబోతున్నాను. అందుకే ఇకపై తెలుగు లోనే బ్లాగ్ రాయాలని అనుకున్నాను.

దానికి కారణం — నా చుట్టూ ఉన్నవారు, ముఖ్యంగా నా బంధువులు కూడా నా బ్లాగ్ చదవాలి అనే ఆలోచన, కోరిక చాలా రోజులుగా నా లోపల ఉండేది.

దాదాపు మూడు నర సంవత్సరాల తరువాత, ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనిపిస్తోంది.

ఇకపై నా మనసులో ఉన్న ఆలోచనలు, భావాలు, అనుభవాలు — బయటకు కనిపించని నా జీవితంలోని ఎన్నో విషయాలు, అలాగే నా చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి — నా బ్లాగ్ ద్వారా మీకు తెలియజేయబోతున్నాను.

---

తిరుపతి మహేష్

14/03/2026    

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం