నిన్న మాట్లాడిన మనిషి… ఈరోజు జ్ఞాపకం
నిన్న ఉదయం నిద్రలేవగానే సెలవు రోజు కావడంతో ఏమి చేయాలా అని ఆలోచించాను.
అప్పుడు మునిరత్నం సర్ గుర్తుకు వచ్చారు. సర్‌ను కలుద్దామని అనుకుని ఫోన్ చేశాను.
అప్పుడు సర్ ఆరోగ్యం బాగోలేక SVIMS ఆసుపత్రిలో చేర్పించారని తెలిసింది.
ఆ విషయం తెలిసిన వెంటనే ఆయనను ఆసుపత్రికి వెళ్లి చూసి రావాలని నిర్ణయించుకున్నాను.
78 సంవత్సరాలు పూర్తి చేసిన మునిరత్నం సర్ చాలా కాలంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు.
అయినా కూడా వాటిని ఎలాగో భరిస్తూ, సాధ్యమైనంత వరకు తన రోజువారీ పనులను చేసుకుంటూ ఉండేవారు.
గత నెల 17వ తేదీన ఒక్కసారిగా ఆరోగ్యం బాగా క్షీణించడంతో సర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారని తెలిసింది.
దానికి రెండు మూడు రోజుల ముందే నేను సర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తుంది.
ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకునే అవకాశం రాలేదు.
నేను తెలుగులో బ్లాగులు రాయడం ప్రారంభించిన తర్వాత, వాటిని సర్‌కు చూపించాలని అనుకుని నిన్న ఆయన ఇంటికి వెళ్లాలని భావించాను.
అప్పుడు సర్ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి వెంటనే ఆయనను చూడడానికి ఆసుపత్రికి వెళ్లాను.
ఆసుపత్రిలో సర్ మరియు మేడమ్ మాత్రమే గదిలో ఉన్నారు.
మేడమ్,
“ఏమండి, మహేష్ మిమ్మల్ని చూడడానికి వచ్చాడు” అని చెప్పగానే
సర్ మెల్లగా నా పేరు పలికారు.
నేను ఆయన చేతిని పట్టుకుని,
“ఏమీ కాదు సర్… భయపడకండి. త్వరలో మీరు కోలుకుని ఇంటికి వస్తారు.
మీ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని కూడా త్వరలో ప్రచురిద్దాం” అని చెప్పాను.
సర్ కూడా అంగీకరించినట్టు “సరే” అన్నారు.
ఆ తర్వాత కొద్దిసేపటికి నా పేరు పిలిచి,
మాట్లాడటానికి కూడా బలహీనంగా ఉన్న స్థితిలో
“ఇప్పుడు ఏ పుస్తకం చదువుతున్నావు?” అని అడిగారు.
కొద్దిసేపు అక్కడే ఉండి,
“మళ్లీ కుదిరినప్పుడు వచ్చి చూస్తాను” అని మేడమ్‌కి చెప్పి
అక్కడి నుంచి బయలుదేరాను.
చాలా కాలంగా పరిచయం ఉన్న, మంచి తత్వం కలిగిన ఒక మనిషిని ఆసుపత్రిలో అలా చూడటం చాలా బాధగా అనిపించింది.
సర్ త్వరలో కోలుకుని మళ్లీ ఇంటికి వస్తారని నిన్నంతా అనుకుంటూ ఉన్నాను.
కానీ…
ఈరోజు ఉదయం నిద్రలేవగానే
“ జక్కంపూడిమునిరత్నం సర్ నిన్న రాత్రి 10 గంటలకు కన్నుమూశారు” అనే వార్త తెలిసింది.
ఆ క్షణం…
కొద్దిసేపు నాకు ఏమీ అర్థం కాలేదు.
నిన్ననే చూసిన మనిషి…
నిన్ననే మాట్లాడిన మనిషి…
ఇప్పుడు లేరు అన్న నిజం చాలా షాకింగ్‌గా అనిపించింది.
2015 ఏప్రిల్ 10న మొదటిసారి మునిరత్నం సర్‌తో నేను ఫోన్‌లో మాట్లాడాను.
ఆ తర్వాత ఎన్నోసార్లు సర్ ఇంటికి వెళ్లి వచ్చాను.
ఫోన్‌లో కూడా తరచూ మాట్లాడుకునేవాళ్లం.
చదవడం మరియు రాయడం విషయాల్లో సర్ నన్ను చాలా ప్రోత్సహించేవారు.
సర్‌కు 67 సంవత్సరాల వయసులో నేను పరిచయం కావడం,
ఆ వయసులో కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆయన ఆసక్తి
నాకు చాలా ప్రేరణగా ఉండేది.
కానీ చివరిసారిగా సర్‌తో నేను మాట్లాడింది
నిన్న ఆసుపత్రిలోనే.
అదే చివరి క్షణం అవుతుందని ఊహించలేదు.
నా జీవితంలో నాకు పరిచయమైన వ్యక్తుల్లో
ప్రొఫెషనల్‌గా కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా
మంచి గుణాలు, మంచి మనసు కలిగిన వ్యక్తి మునిరత్నం సర్.
ఇప్పుడు ఆయన లేరు అన్న నిజాన్ని అంగీకరించాల్సిందే.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
---
తిరుపతి మహేష్
15/03/2026
Comments
Post a Comment