సర్ లేరు… కానీ జ్ఞాపకాలు ఉన్నాయి
ఈ రోజు ఉదయం నిద్రలేవగానే “జక్కంపూడి మునిరత్నం సర్ నిన్న రాత్రి 10 గంటలకు కన్నుమూశారు” అనే వార్త తెలిసింది.
ఆ వార్త విన్న క్షణం కొద్దిసేపు నాకు ఏమీ అర్థం కాలేదు.
నిన్ననే నేను SVIMS హాస్పిటల్‌కి వెళ్లి సర్‌ను చూసి మాట్లాడి వచ్చాను. అలాంటప్పుడు రాత్రికి ఆయన మరణించారని వినడం నాకు చాలా షాక్‌గా అనిపించింది. కొద్దిసేపు
ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు.
చివరికి సర్‌ను ఒకసారి చూడాలనే భావన కలిగింది.
సర్ స్వస్థలం తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో ఉన్న తిరువాలంగాడు పక్కన ఉన్న ఒక గ్రామం కావడంతో, అంత్యక్రియల కోసం ఆయన భౌతిక దేహాన్ని అక్కడికి తీసుకెళ్తారా
లేక తిరుపతిలోనే ఆయన ఇంటి దగ్గర నిర్వహిస్తారా అన్న సందేహం వచ్చింది.
ఉదయం సుమారు 8 గంటల సమయంలో మునిరత్నం సర్ భార్యగారి చెల్లెలి కుమారుడు కిట్టుకు ఫోన్ చేసి, ఎక్కడ అంత్యక్రియలు చేస్తారో అడిగి తెలుసుకున్నాను. తిరుపతిలోనే చేస్తారని
కిట్టు చెప్పడంతో ఉదయం 11:30 సమయంలో నేను, నా తల్లి, తండ్రి ముగ్గురం కలిసి ఆటోలో తిరుపతి తాటితోపులో ఉన్న సర్ ఇంటికి వెళ్లాము.
అక్కడ సర్ భౌతిక దేహాన్ని చూసి, మేడమ్‌తో కొంతసేపు మాట్లాడాను.
“నిన్న నేను హాస్పిటల్‌కి వచ్చినప్పుడు సర్ మాట్లాడారు. తర్వాత ఏమైంది మేడమ్?” అని అడిగాను.
తర్వాత ఏమి జరిగిందో మేడమ్ వివరంగా చెప్పారు.
నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ వాళ్లు సర్‌ను కావాలంటే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. సర్‌కూ ఇంటికి వెళ్లాలని అనిపించడంతో, సాయంత్రం 4 గంటల
తర్వాత డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, సాయంత్రం 7 గంటల సమయంలో సర్‌ను ఇంటికి తీసుకువచ్చారట.
ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బెడ్‌రూమ్‌కి కూడా వెళ్లకుండా హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారట. చుట్టూ కుమార్తె, అల్లుడు, ఇతర బంధువులు అందరూ ఉన్నారట.
కొద్దిసేపటి తర్వాత టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పడంతో వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారట. అప్పుడు మధ్యాహ్నం నుంచే టాయిలెట్ రావాలనిపిస్తోందిగానీ రావడం లేదని చెప్పారు.
మళ్లీ హాల్లోని సోఫాలో కూర్చోబెట్టారట.
సర్‌కు ప్రతిరోజూ ఆల్ ఇండియా రేడియో వార్తలు వినడం అలవాటు. అలాగే రాత్రి వార్తలు పెట్టమని చెప్పారు. వార్తలు విన్నారు.
ఆ తర్వాత అందరూ చుట్టూ ఉండగానే ఒక్కసారిగా ఒక వైపు వాలిపోయారట. వెంటనే మళ్లీ SVIMS హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని అనుకునేలోపే ఆయన ప్రాణం విడిచారని మేడమ్ చెప్పారు.
మేడమ్ ఈ సంగతులన్నీ చెబుతుండగా, నేను ఎన్నోసార్లు సర్ ఇంటికి వెళ్లిన జ్ఞాపకాలు నా కళ్ల ముందుకు వచ్చాయి.
ఆ తర్వాత పక్కనే ఉన్న తన బంధువులతో “ఆయనకు కంప్యూటర్ మహేష్ నేర్పించాడు. కంప్యూటర్‌లో ఏదైనా సమస్య వస్తే మహేష్‌కి ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తాడు” అని.
మేడమ్ చెబుతుండగా, నాకు మాత్రం గత 11 సంవత్సరాలుగా సర్ మరియు మేడమ్‌తో ఉన్న పరిచయ జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ల ముందుకు వచ్చి పోయాయి.
చాలాసార్లు నేను సర్‌కు ఒక మాట చెప్పేవాడిని —
“వీలైనంత త్వరగా మీ ఆత్మకథను పుస్తకంగా ప్రచురిస్తే చాలా బాగుంటుంది సర్” అని.
కానీ ఆ ప్రక్రియలో కొంచెం ఆలస్యం అయింది.
ఇప్పుడు సర్ మనతో లేరు.
ఇంటికి బయలుదేరే ముందు మేడమ్‌తో “సర్ గారి ఆత్మకథను మనం అందరం కలిసి తప్పకుండా ప్రచురిద్దాం మేడమ్. నా తరఫున ఏ సహాయం కావాలన్నా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను.
---
జక్కంపూడి మునిరత్నం సర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో 20 సంవత్సరాలకు పైగా పని చేసి రిటైర్ అయ్యారు.
ఆయన పర్యవేక్షణలో 12 మంది పీహెచ్‌డీ, 8 మంది ఎం.ఫిల్ పూర్తి చేశారు.
30కు పైగా పుస్తకాలు రచించారు. ఆ పుస్తకాలలో చాలా వాటిపై వివిధ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు పరిశోధనలు కూడా చేశారు.
ఎలాంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాలు లేకుండానే, కేవలం తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో సర్ సాధించిన విషయాలు నాకు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేవి. అదే నాకు ఒక ప్రేరణగా
ఉండేది.
నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా, ఆయన ఎంత పనిలో ఉన్నా “బిజీగా ఉన్నాను” అని చెప్పకుండా, నేను చెప్పేది పూర్తిగా విని తర్వాత మాట్లాడేవారు.
ప్రతి సారి నాతో మాట్లాడినప్పుడు నా తమ్ముడు గురించి తప్పకుండా అడిగేవారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో “జక్కంపూడి మునిరత్నం సర్” అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఆ వయసులో సర్ లాంటి ప్రతిభావంతుడైన దృష్టి లోపం ఉన్న వ్యక్తిని నేను చాలా అరుదుగా చూశాను.
అలాంటి వ్యక్తితో నాకు 11 సంవత్సరాల పాటు వయసు తేడా లేకుండా స్నేహం కలగడం నా అదృష్టంగా భావిస్తాను.
సర్ వైపు సోదరులు, సోదరీమణుల గురించి నాకు పెద్దగా పరిచయం లేకపోయినా, మేడమ్ వైపు బంధువులంతా నాకు బాగా పరిచయం.
మేడమ్‌కు ఇద్దరు చెల్లెల్లు, ఒక అన్నయ్య ఉన్నారు.
వారు అందరూ తిరుపతిలోనే ఉంటారు. వారి కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ సర్‌కు ఎంతో అండగా ఉండేవారు.
ఒక పెద్ద మర్రిచెట్టుకింద అందరూ కలిసి ఉన్నట్టుగా ఉండేది ఆ కుటుంబం.
ఇప్పుడు ఆ మర్రిచెట్టు లేదు.
ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు నిద్రపోయాను.
నిద్ర లేచిన తర్వాత
ఇకపై మునిరత్నం సర్‌తో నేను మాట్లాడలేను అని గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఒక చిన్న బాధ కలుగుతోంది.
---
తిరుపతి మహేష్
15/03/2026
Comments
Post a Comment