పుత్తూరు ప్రయాణం… తిరుత్తణి అనుభవం

నేను తిరుత్తణి SBI మెయిన్ బ్రాంచ్‌లో సుమారు ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను. కానీ ఆ సమయంలో నేను ఒక్కసారి మాత్రమే — అది కూడా 2018 జూలై నెలలో — తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి వెళ్లాను. అది కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేసి వెళ్లింది కాదు. మా అమ్మకు SBI లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి తిరుత్తణికి వచ్చినప్పుడు, నాకు అయితే దేవుళ్లపై నమ్మకం లేదు కానీ నమ్మకం ఉన్న అమ్మను తీసుకెళ్దామని సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకెళ్లాను. అంతే. ఆ తర్వాత అనుకోకుండా, దాదాపు 8 సంవత్సరాల తర్వాత, నిన్న సాయంత్రం మళ్లీ తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లాను.

 ---

వరుసగా మూడు రోజుల సెలవులు ఉండటంతో ఇంట్లోనే ఉండి బాగా బోర్ కొట్టేసింది. చాలా రోజులుగా పుత్తూరులో ఉన్న మా అక్క (నగరి ఉషారాణి పెద్దనాన్న కూతురు) ఇంటికి వెళ్లాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ నా అలసత్వం వల్ల వెళ్లలేకపోయాను.

చివరికి నిన్న సాయంత్రం 4:30కి తిరుపతి బస్ స్టాండ్‌లో తమ్ముడు నన్ను పుత్తూరు బస్ ఎక్కించాడు.

దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ రూట్‌లో నేను బస్‌లో ప్రయాణం చేశాను. అదికాకుండా, లేడీస్‌కు ఫ్రీ బస్ ప్రయాణం ప్రారంభమైన తర్వాత నేను మొదటిసారి బస్‌లో వెళ్లడం కావడంతో—

సోషల్ మీడియాలో లేడీస్‌కు ఫ్రీ బస్ గురించి చాలా మీమ్స్ చూశాను. బస్‌లో ఎంత రద్దీ ఉంటుందో కూడా విన్నాను. కానీ నిన్న అది ప్రత్యక్షంగా చూసాను.

బస్‌లో 90% మంది మహిళలే ఉండటంతో, ఒకసారి నేను ఎక్కింది లేడీస్ స్పెషల్ బస్ ఏమైనా అనిపించింది 😄

సరిగ్గా గంట ప్రయాణం తర్వాత సాయంత్రం ఐదున్నరకు పుత్తూరు చేరుకున్నాను. అక్కడ నా బాబాయి కొడుకు వాసు నన్ను పికప్ చేసి మా అక్క ఇంటికి తీసుకెళ్లాడు.

నిన్న రాత్రి అక్క వాళ్ల ఇంట్లో ఉండి, ఈ రోజు సాయంత్రం తిరుపతికి తిరిగి రావాలని నా ప్లాన్.

అక్కవాళ్ల ఇంట్లో ఉండగా, వాసు అకస్మాత్తుగా “తిరుత్తణికి వెల్దామా?” అని అడిగాడు. ఇంట్లో ఖాళీగానే ఉన్నాము కాబట్టి, అదీ తిరుత్తణి కావడంతో “వెల్దాం” అన్నాను.

సాయంత్రం 6:30కి అక్కవాళ్ల ఇంటి నుంచి నేను–వాసు ఇద్దరం బైక్‌పై తిరుత్తణికి బయలుదేరాము.

---

నేను చాలా సంవత్సరాలు తిరుపతి–పుత్తూరు–నగరి–తిరుత్తణి రూట్‌లో ప్రయాణం చేశాను.

తిరుపతి నుంచి పుత్తూరు వరకు మంచి 4-లైన్ రోడ్ ఉంది. కానీ పుత్తూరు తర్వాత డబుల్ రోడ్ మాత్రమే ఉండేది.

ఇప్పుడు పరిస్థితి మారుతోంది.

పుత్తూరు–తిరుత్తణి రోడ్‌ను 4-లైన్‌గా విస్తరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల దగ్గర బ్రిడ్జ్‌లు కూడా కడుతున్నారు.

ఈ పనులు పూర్తయ్యాక, చెన్నై–తిరుపతి (తిరుత్తణి మార్గం ద్వారా) ప్రయాణం చాలా స్మూత్‌గా, వేగంగా ఉంటుందని అనిపించింది.

వాసు రోడ్ ఎక్స్‌పాంశన్ పనుల గురించి చెబుతుండగా, నేను వింటూ భవిష్యత్తులో ఆ రోడ్ చుట్టూ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వెళ్లాను.

సాయంత్రం 7:30కి తిరుత్తణి కొండపైకి చేరుకున్నాము. ఒక గంటలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పూర్తిచేసుకున్నాము.

ఇక్కడ ఒక మాట చెప్పాలి.

వాసుతో ఎక్కడికైనా నేను బయటికి వెళ్లినప్పుడు, చుట్టూ ఏముందో అతను వివరంగా చెప్పడం వల్ల నాకు ఒక సంతృప్తి భావం కలుగుతుంది. నిన్న గుడిలో కూడా అతను నాకు వివరంగా చెప్పడంతో, నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను.

గుడి నుంచి బయటికి వచ్చాక, చెక్కర పొంగలి మరియు పులిహోర తీసుకుని తిన్నాము.

రాత్రి 8:30కి తిరుగు ప్రయాణంలో, నేను తిరుత్తణిలో పనిచేసిన SBI బ్రాంచ్‌ను వాసుకి చూపిస్తూ, నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ,  వాసు జీవితంగురించి మాట్లాడుకుంటూ, రాత్రి 9:30కి మళ్లీ పుత్తూరులో ఉన్న మా అక్క ఇంటికి చేరుకున్నాము.

---

ఈరోజు ఉదయం 8 తర్వాత లేచి, రెడీ అయి టిఫిన్ చేసి ఇంట్లోనే ఉన్నాను. టీవీలో “కుబేర” సినిమా వస్తే చూశాను.

మధ్యాహ్నం అక్క చేసిన చేపల పులుసు తిని, కాసేపు నిద్రపోయాను.

సాయంత్రం 4:30కి తిరుపతికి బయలుదేరాను.

పుత్తూరులో మా మామ మధుసూదన్ రెడ్డి నన్ను బస్ ఎక్కించారు.

తిరుపతిలో లక్ష్మీపురం సర్కిల్ వద్ద తమ్ముడు నన్ను పికప్ చేసుకున్నాడు.

ఇలా వరుసగా వచ్చిన మూడు రోజుల సెలవుల్లో, చాలా రోజులుగా అనుకుంటూనే ఉన్న అక్కవాళ్ల ఇంటికి వెళ్లడం జరిగింది. అలాగే అనుకోకుండా వాసు వల్ల తిరుత్తణికి కూడా వెళ్లడం జరిగింది.

అరోహర 🙏

---

– తిరుపతి మహేష్

29/03/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

దీక్ష భగ్నం అయింది… My Lord!

మూడవ సంవత్సరం…

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

💊 పారాసిటమాల్ అంటే అది ఒక మాత్ర కాదు… అది ఒక...

ఆడియో డిస్క్రిప్షన్‌తో కనిపించిన కొత్త ప్రపంచం… స్ట్రెస్‌తో నా పోరాటం