ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతూ...
ఎప్పుడైనా ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, ఆ సమయంలో మనకు ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తుంది.
సమయం గడవక, సమస్యకు పరిష్కారం దొరకక, మానసికంగా ఎంతో బాధపడవచ్చు.
కానీ ఒకసారి ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాక, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే... రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయో అనిపిస్తుంది. ఒకప్పుడు అనుభవించిన ఆ మానసిక బాధ కూడా అంతగా గుర్తుండదు.
2022 జూన్ 24, శుక్రవారం సాయంత్రం...
సరిగ్గా ఐదున్నర సంవత్సరాలు ఎస్‌బీఐ తిరుత్తణి మెయిన్ బ్రాంచ్‌లో పనిచేసిన తర్వాత, ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురుచూస్తున్న ఇంటర్ సర్కిల్ ట్రాన్స్‌ఫర్ చివరకు నాకు వచ్చింది. ఆ రోజు రిలీవ్ అయి తిరుపతికి వచ్చేశాను.
ఆ తర్వాత వారం రోజులకు...
2022 జూలై 2, శనివారం...
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఈ రోజే నేను తిరుపతిలోని మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో రిపోర్ట్ చేశాను.
కొత్త బ్రాంచ్... కొత్త మనుషులు...
అంతకు ముందు నాకు అక్కడ ఎవరూ పరిచయం లేదు. అందుకే చాలా భయంగా, కొత్త వాతావరణంపై ఒక తెలియని ఆందోళనగా అనిపించింది.
అయితే, ఆ సమయంలో మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో లోకల్ సెక్రటరీగా శ్రీనివాస్ ఉండటం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది.
అంతేకాకుండా, అకౌంటెంట్ గిరిజా మేడమ్ నుంచి సీనియర్ క్లరికల్ స్టాఫ్ వరకు అందరి సహకారంతో అప్పట్లో బ్రాంచ్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది.
సరిగ్గా నెల రోజులకే, 2022 ఆగస్టులో నేను, నా తమ్ముడు కలిసి రెండు వారాల నేపాల్ ట్రిప్‌కు వెళ్లాం.
అదే సంవత్సరం అక్టోబర్‌లో మళ్లీ ఇద్దరం కలిసి భూటాన్ ట్రిప్‌కు వెళ్లాం.
2023 జనవరి చివరి వారంలో కూడా నేను, నా తమ్ముడు కలిసి లడాఖ్ ట్రిప్‌కు వెళ్లాం.
ఆ మూడు ట్రిప్‌ల విషయంలో కూడా సెలవుల కోసం నేను ఒక్కసారి కూడా అప్పటి మునిసిపల్ రోడ్ చీఫ్ మేనేజర్‌ను నేరుగా సంప్రదించలేదు.
లోకల్ సెక్రటరీ శ్రీనివాస్ సెలవుల గురించి చీఫ్ మేనేజర్‌తో మాట్లాడేవారు. నేను మాత్రం ట్రిప్‌కు బయలుదేరే ముందు చివరి నిమిషంలో ఒకసారి చీఫ్ మేనేజర్‌కు చెప్పి వెళ్లిపోయేవాడిని. అంతే.
లడాఖ్ ట్రిప్ ముగించుకుని తిరిగి వచ్చిన కొద్దిరోజులకే తిరుపతిలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు గురించి మా ఇంట్లో చర్చ మొదలైంది.
నేను కొన్ని సలహాలు ఇచ్చాను. కానీ అవి మా అమ్మానాన్నలకు నచ్చలేదు.
ఆ విషయంపై మా మధ్య విభేదాలు వచ్చాయి.
వాళ్లు తీసుకున్న నిర్ణయంలో చాలా దృఢంగా ఉన్నారు.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే... అనవసరంగా నేనే ఎక్కువగా మంచి జరగాలని ఆలోచించి, ఆ విషయాన్ని అతిగా పట్టించుకున్నానేమో అనిపిస్తుంది.
ఉద్యోగ పరంగా చూస్తే...
2023 మే వరకు మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో నా రోజులు ఒకరకంగా "హనీమూన్ పీరియడ్" లాగా గడిచాయి.
పెద్దగా ఒత్తిడి లేకుండా రోజులు ప్రశాంతంగా సాగిపోయాయి.
కానీ ఆ తర్వాత నుంచి మాత్రం పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి.
2024 గడిచిపోయింది.
2025 కూడా గడిచిపోయింది.
ఇప్పుడు 2026లో కూడా సగం సంవత్సరం పూర్తయ్యింది.
మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో నాలుగు సంవత్సరాలు ఎలాగోలా గడిచిపోయాయి.
కానీ నెల క్రితం వచ్చిన కొత్త చీఫ్ మేనేజర్ మెంటాలిటీ మాత్రం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.
దీనికి ముందు రెండేళ్ల పాటు చీఫ్ మేనేజర్‌గా పనిచేసిన సుధాకర్ సర్ ఇప్పుడు తలుచుకుంటే దేవుడిలా అనిపిస్తున్నారు.
ఆయన ఒక్కరోజు కూడా పని విషయంలో నాపై ఒత్తిడి తీసుకురాలేదు. నేను నా పని చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోయేవాడిని.
కానీ ఇప్పుడు వచ్చిన చీఫ్ మేనేజర్ మాత్రం ఎప్పుడూ "బిజినెస్... బిజినెస్..." అనే హడావిడి, ఆత్రుతతో ఉంటున్నారు.
అనుకున్నది వెంటనే జరిగిపోవాలనే మనస్తత్వం ఆయనలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
నా విషయంలో కూడా ఆయన చాలా అంచనాలు పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. కానీ ఆ అంచనాలకు అనుగుణంగా పని చేయడం నా వల్ల కావడం లేదు.
చూడాలి...
రాబోయే రోజులు మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో ఎలా ఉండబోతున్నాయో.
నెల క్రితం ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ తిరుపతి రీజినల్ సెక్రటరీ శ్రీకాంత్ సర్ మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌కు వచ్చినప్పుడు,
"మహేష్, ఇంటికి దగ్గరగా ఉన్న ఏదైనా బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటావా?" అని అడిగారు.
అప్పుడు నేను,
"మునిసిపల్ రోడ్ బ్రాంచ్‌లో బాగానే ఉంది సర్. ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్ అవసరం లేదు."
అని సమాధానం ఇచ్చాను.
కానీ ఈ ఒక్క నెలలో...
కొత్త చీఫ్ మేనేజర్ రావడం, ఆయన మెంటాలిటీ చూసిన తర్వాత...
మునిసిపల్ రోడ్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని వేరే ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుంటుందేమో అనే ఆలోచన మాత్రం ఇప్పుడు మొదలైంది...
– తిరుపతి మహేష్
02-07-2026
Comments
Post a Comment