వాసు చెప్పిన సినిమా... పదేపదే గుర్తొచ్చిన ఒక అమ్మాయి

ప్రతిరోజూ బ్యాంకులో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాను.

అది కూడా రెండో శనివారం లేదా నాలుగో శనివారం ఆదివారంతో కలిపి సెలవులు వస్తే, ఆ వీకెండ్‌లో ఏమి చేయాలా అని ముందుగానే ఆలోచించడం మొదలుపెడతాను.

ఎక్కడికైనా వెళ్లాలని అనిపిస్తుంది. కానీ చాలా సార్లు అది ఆలోచనగానే మిగిలిపోతుంది. చివరికి ఇంట్లోనే ఉండిపోతాను.

ఈ వారం కూడా అలాగే జరిగింది.

శుక్రవారం సాయంత్రం వరకు ఎక్కడికైనా వెళ్లాలి అనిపించింది. చివరికి ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను.

నిన్న రెండో శనివారం కావడంతో బ్యాంక్‌కి సెలవు. ఉదయం ఎనిమిదిన్నర సమయంలో మెలకువ వచ్చి నిద్రలేచాను. 9 గంటల సమయంలో  బాబాయి కొడుకు వాసు ఫోన్ చేశాడు. తాను ఒక సినిమా చూస్తున్నానని చెప్పి, ఆ సినిమా పేరు చెప్పాడు.

ఆ సినిమా పేరు నేను అంతకుముందు ఎప్పుడూ వినలేదు. సాధారణంగా నేను కొత్తగా విడుదలయ్యే సినిమాల గురించి తెలుసుకుంటూ ఉంటాను.

వాసు చెప్పిన సినిమా పేరు నాకు తెలియకపోవడంతో, ఏదో పాత సినిమా అయి ఉంటుందని అనుకున్నాను.

తర్వాత యూట్యూబ్‌లో ఆ సినిమా ట్రైలర్ చూశాను. ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని కలిగించింది. అందుకే గూగుల్‌లో ఆ సినిమా ఎప్పుడు విడుదలైందో వెతికాను.

అప్పుడు తెలిసింది ఏమిటంటే, వాసు చెప్పిన సినిమా "రమణి కళ్యాణం" గత నెల మే 22న విడుదలైంది. అలాగే కేవలం రెండు రోజుల క్రితం, అంటే శుక్రవారం, అమెజాన్ ప్రైమ్ మరియు సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికల్లో విడుదలైంది.

"రమణి కళ్యాణం" సినిమా చూడాలనిపించడానికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న కథానాయిక పాత్ర. ఆమె దృష్టి లోపం ఉన్న యువతిగా నటించింది.

ఆ పాత్రను సినిమాలో ఎలా చూపించారో చూడాలనే ఆసక్తి నాలో ఏర్పడడంతో నిన్న మధ్యాహ్నం 'రమణి కళ్యాణం' సినిమా చూశాను.

ఈ సినిమా దర్శకుడికి ఇదే తొలి చిత్రం. ఆయన అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్‌ఆర్‌ఐ. తన స్నేహితులతో కలిసి ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించి విడుదల చేశారు.

నాకు సినిమా నచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, సినిమా మొత్తం చూస్తున్నప్పుడు, ముఖ్యంగా కథానాయిక పాత్రను చూస్తున్నప్పుడు, ఆ పాత్ర నాకు తెలిసిన ఒక అమ్మాయిని పదేపదే గుర్తు చేసింది:)

2001లో లయ నటించిన "ప్రేమించు" సినిమాలో కూడా చూపులేని అమ్మాయి పాత్ర ఉంటుంది. ఆ సినిమాను థియేటర్‌లో ఒకసారి చూసిన గుర్తు.

కానీ ఆ సినిమా నాకు ఇచ్చిన ఎమోషనల్ ఫీల్‌ను ఈ సినిమా ఇవ్వలేకపోయింది.

డైరెక్టర్ ఇంకాస్త సమయం తీసుకుని స్క్రిప్ట్‌ను బలంగా రాసుకుని, క్లైమాక్స్‌ను ట్రాజెడీగా కాకుండా మరోలా ముగించి ఉంటే బాగుండేది.

మీరుకానీ ఒక మంచి భావోద్వేగభరితమైన ఎమోషనల్ డ్రామా చూడాలని అనుకుంటే "రమణి కళ్యాణం" సినిమాను ఒకసారి చూడొచ్చు.

‘రమణి కళ్యాణం’ సినిమా ట్రైలర్ చూడాలనుకుంటే ఇక్కడ

క్లిక్ చేయండి.

---

తిరుపతి మహేష్

14/06/2026 

Comments

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న