మూడో బిడ్డకు 30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైండ్ ఏమైనా దొబ్బిందా?

అసలు నేను ఎప్పుడూ కూడా “గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తిడతాను” అని కలలో కూడా అనుకోలేదు.

నాకు ఆయనపై మంచి అభిప్రాయం ఉండేది.

ఆయన విజన్ ఉన్న మనిషి అనుకునేవాడిని.

కానీ రెండు రోజుల క్రితం నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంతానోత్పత్తి పెంచాల్సిన అవసరం గురించి ఉపన్యాసం చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి శాతం భవిష్యత్తులో తీవ్రమైన మానవ వనరుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని బాబు గారు బాధపడుతున్నారు.

జనాభా నియంత్రణ పథకాల బదులు జనాభా వృద్ధి శాతం పెంచాలని, దానికోసం population management policy తీసుకొచ్చి మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30 వేల రూపాయలు ఇస్తామని, నాలుగో బిడ్డ పుడితే 40 వేలు ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు.

“పిల్లలు భారం అనుకోకూడదు… వాళ్లే సంపద” అని రాష్ట్రంలోని తల్లిదండ్రులను బాబు గారు కోరారు.

ఈ విషయం ఈరోజు నాకు తెలిసిన వెంటనే నా లోపల తెలియని కోపం, ఆవేశం బాబు గారి మీద కలిగింది.

బాబు గారు ప్రవేశపెట్టబోయే people management policy పై చాలా తీవ్ర వ్యతిరేకత కలిగింది.

డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఆర్థిక నిపుణులు, సామాన్యులు కూడా దీనిని వ్యతిరేకించడం చూసి

నాకు సంతోషం కలిగింది.

ఇప్పటికే “కుదిరితే రాబోయే కాలంలో పిల్లలను కనకపోవడమే ఉత్తమం” అని అనుకుంటుంటాను.

నాకు తెలిసిన ఎవరికైనా మొదటి సంతానం పుడితే “ఒక్కరితో ఆపేయండి… రెండో సంతానం గురించి ఆలోచించకండి” అని మొహమాటం లేకుండా చెబుతాను.

ఎందుకంటే వందలకొద్దీ తల్లిదండ్రుల జీవితాలను చాలా దగ్గరగా చూశాను.

వాళ్లు పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్నాక నాకు తెలిసింది ఒక్కటే…

ప్రస్తుత కాలంలో డబ్బున్న తల్లిదండ్రుల పిల్లలు మాత్రమే జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్తున్నారు.

అదే పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల జీవితం వారికే నరకం అయితే,

ఇక వారి పిల్లల భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అందరికీ సమానమైన ఉచిత విద్య,

సమానమైన ఆరోగ్య సేవలు రాష్ట్రంలో ఉంటే బాబు గారు చెప్పిన దానిపై ఆలోచించవచ్చు.

కానీ అలాంటి పరిస్థితి లేదు.

సర్కారు బడిలో పని చేసే టీచర్ కూడా తన పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు.

గవర్నమెంట్ డాక్టర్లు కూడా తమ ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటళ్లకే వెళ్తున్నారు.

క్వాలిటీ లేని చదువు, క్వాలిటీ లేని హెల్త్‌కేర్ మధ్య పేద తల్లిదండ్రులు

నలుగురు పిల్లలను ఎలా పెంచుతారు?

మనిషి అంటేనే ఆశావాది.

పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు కూడా “మా పిల్లలు బాగా చదివి మా స్థితి మార్చుతారు” అని ఆశపడతారు.

కానీ ఆ ఆశతోనే ఇప్పటి కాలంలో పిల్లలను ఎక్కువగా కనడం వల్ల తల్లిదండ్రులు మరియు వారి పిల్లల మధ్య ఎన్ని సమస్యలు వస్తాయో బాబు గారికి తెలుసా?

నిరుద్యోగ సమస్య…

ద్రవ్యోల్బణం పెరగడం వల్ల రోజురోజుకీ రూపాయి విలువ పడిపోవడం…

ఎంత సంపాదించినా దానికి మించిన ఖర్చులు రావడం…

ఇవన్నీ ఒక సామాన్యుడు పడుతున్న బాధలు.

బాబు గారికి ఇవి తెలుసా?

ఆయనేమో ఒక్కరినే కని ఆపేశారు.

ఆయన కుమారుడు కూడా ఒక్కరితోనే ఆపుకున్నారు.

వాళ్లు మాత్రం నిమ్మదిగా ఉండవచ్చు.

కానీ మిగతావాళ్లు మాత్రం నిమ్మదిలేకుండా జీవితాంతం బతికున్నప్పుడే నరకవేదన అనుభవిస్తూ బ్రతకాలా?

అదే బాబు గారు కోరుకుంటున్నారా?

దయచేసి ఈ people management policyని

ప్రవేశపెట్టకూడదని చాలా తీవ్రంగా కోరుకుంటున్నాను.

---

కొన్ని రోజుల క్రితం నేను నాకు అంతకుముందు పరిచయం లేని ఒక వ్యక్తిని కలవడం జరిగింది.

మాటల్లో నాకు పెళ్లి కాలేదని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.

ఆయన మాత్రమే కాదు…

నేను పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం నా ఆలోచనా విధానం… లేదంటే నా mindset అని చెప్పవచ్చు.

అది ఏమిటంటే…

పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను కనాలి… జీవితాంతం వారి గురించే ఆలోచించాలి…

అన్నది నాకు అసలు ఇష్టం లేదు.

మొదట నా జీవితాన్నే నేను చక్కదిద్దుకోలేకపోతున్నాను.

ఇందులో ఇంకొకరిని ఈ ప్రపంచానికి తీసుకొచ్చి వారి జీవితాన్ని కూడా నాశనం చేయాలని కోరుకోవడం లేదు.

పిల్లలను కనడం అంటే వారిని చాలా బాగా చూసుకోవాలి.

అది lifetime commitment.

దానికి నేను న్యాయం చేయలేను.

“పెళ్లి చేసుకోవాలి కానీ పిల్లలు వద్దు” అంటే ఏ అమ్మాయి ఒప్పుకోదని నాకు తెలుసు.

కాబట్టి పెళ్లి అనే ఆలోచనే నాకు అసలు లేదు.

ఒకవేళ చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకుని ఉంటే బహుశా నాకు కూడా

జీవితం, పెళ్లి, పిల్లల మీద

ఒక నమ్మకం వచ్చేదేమో.

అది జరగకపోవడం వల్లనే నేను ఇలా ఆలోచిస్తున్నానేమో…

---

మరి మీరు బాబు గారి ఆలోచన గురించి ఏం అనుకుంటున్నారు?

మీకు తోచింది కింద comment box లో చెప్పి వెళ్లండి…

— తిరుపతి మహేష్

20/05/2026 

Comments

Post a Comment

Popular posts from this blog

మీతో పంచుకోవాలనుకున్న ఒక సంతోషకరమైన విషయం…... Welcome to My...

తప్పు ఎవరిదైనా… చివరికి నష్టపోయేది మాత్రం...

ఒక తండ్రి మనసు…

Happy Birthday to My Dear…... ❤️

రెండు సంవత్సరాల క్రితం… సరిగ్గా ఈ రోజు: మేము ఇల్లు మారిన కథ

అగ్నిపరీక్ష

వెనక్కి వెళ్లిన అడుగులు… మళ్లీ మేల్కొన్న జ్ఞాపకాలు...

దీక్ష భగ్నం అయింది… My Lord!

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం… ఇంకా ఉన్నాయా?

ఒక అమ్మాయి అడిగిన ప్రశ్న