భరించలేని నొప్పి...
చిన్నప్పటి నుంచే నేను చాలా మంది పైల్స్ సమస్యతో ఇబ్బందిపడటం గురించి విన్నాను.
వారిలో చాలామంది అలోపతి (English Medicine) చికిత్స కాకుండా, నాటు వైద్యం, ఆయుర్వేదం వంటి చికిత్సలు తీసుకున్నారని కూడా విన్నాను.
అది 2023 డిసెంబర్ చివరి వారం.
2024 కొత్త సంవత్సరానికి ఇంకా కొన్ని రోజులే ఉండగా, నాకు ఒక్కసారిగా ఒక కొత్త సమస్య వచ్చి పడింది.
అంతకుముందు ఎప్పుడూ లేని సమస్య అది.
సమస్య రాగానే నాకు వెంటనే అర్థమైపోయింది...
"కచ్చితంగా ఇది పైల్స్ సమస్యే అయి ఉంటుంది."
చిన్నప్పటి నుంచే ఇతరులకు పైల్స్ రావడం గురించి విన్న నేను... చివరికి అదే సమస్య నాకూ వచ్చేసిందని అర్థమయ్యాక చాలా భయపడ్డాను. చాలా బాధపడ్డాను.
"పైల్స్ వస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే." అనే భావన అప్పట్లో నా మనసులో బలంగా ఉండేది.
అప్పుడు మా పెద్ద నాన్న కొడుకు నగరి రమేష్, తిరుపతిలో ఉన్న ఒక ఆయుర్వేద డాక్టర్ అడ్రస్ ఇచ్చి, ఒకసారి వెళ్లి చూపించమని చెప్పాడు.
నమ్మకం లేకపోయినా...
2023 డిసెంబర్ చివరి వారంలో ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లాను.
డాక్టర్ పరీక్షించి, నేను అనుకున్నట్టుగానే అది పైల్స్ అని నిర్ధారించారు.
రెండు వారాలకు సరిపడా మందులు ఇచ్చారు.
ఆ మందులు వేసుకోవడం ప్రారంభించిన రెండో రోజుకే నొప్పి తగ్గడం మొదలైంది.
ఒక వారం రోజుల్లో పూర్తిగా నార్మల్ అయిపోయాను.
మళ్లీ...
2024 జూలైలో అదే సమస్య మళ్లీ వచ్చింది.
అప్పుడు కూడా అదే ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు వెళ్లాను.
మళ్లీ రెండు వారాలకు మందులు ఇచ్చారు.
అవి వేసుకుంటే మళ్లీ నార్మల్ అయిపోయాను.
గత సంవత్సరం, 2025 నవంబర్‌లో మరోసారి నొప్పి రావడంతో...
మూడోసారి కూడా అదే డాక్టర్ దగ్గరకు వెళ్లి, ఆయన ఇచ్చిన రెండు వారాల మందులు వాడాను.
మళ్లీ నొప్పి తగ్గిపోయింది.
అలా ప్రతి సారి సమస్య వచ్చినప్పుడు మందులతో తగ్గిపోతూ వచ్చింది.
కానీ...
రెండు వారాల క్రితం అదే సమస్య మళ్లీ ప్రారంభమైంది.
Free motion అవ్వడమే చాలా కష్టంగా మారింది.
మల విసర్జన సమయంలో భరించలేని నొప్పి ఉండేది.
అందువల్ల...
చేసేదేమీ లేక మళ్లీ అదే ఆయుర్వేద డాక్టర్ దగ్గరకు నాలుగోసారి కూడా వెళ్లాను.
ఎప్పటిలాగే రెండు వారాల మందులు రాశారు.
కానీ ఈసారి ఒక మాట చెప్పారు.
"ఇక నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా మళ్లీ మళ్లీ వస్తుంటే... సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది."
మందులు తీసుకుని ఇంటికి వచ్చి వాడటం ప్రారంభించాను.
కానీ ఈసారి ఏమైందో తెలియదు...
నొప్పి ఏమాత్రం తగ్గలేదు.
ఆయింట్‌మెంట్ కూడా పెద్దగా పని చేయడం లేదని అర్థమైంది.
కారణం ఏమిటో తెలియదు.
---
ఈరోజు...
ఉదయం నిద్ర లేచినప్పుడే ఏదో తేడాగా అనిపించింది.
బెడ్ నుంచి లేచి బాత్రూమ్‌కు వెళ్లడానికే చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఆ పరిస్థితిలో బ్యాంక్‌కు వెళ్లాలని అస్సలు అనిపించలేదు.
సెలవు పెట్టేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలనిపించింది.
అయినా...
ఎలాగోలా రెడీ అయి బ్యాంక్‌కు వెళ్లిపోయాను.
బ్యాంక్‌కు వెళ్లాక పైల్స్ నొప్పి మరింత ఎక్కువైంది.
కొద్దిసేపటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మొదలైంది.
అసౌకర్యం ప్రతి నిమిషం పెరుగుతుండటంతో...
సీట్లో కూడా సరిగా కూర్చోలేకపోయాను.
మలద్వారం వద్ద ప్రతి క్షణం ముళ్లు గుచ్చుతున్నట్టుగా భరించలేని నొప్పి వేధించింది.
చివరికి...
మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత బ్రాంచ్ చీఫ్ మేనేజర్ దినకర్ సర్‌ను పర్మిషన్ అడిగి...
బ్యాంక్ కారు డ్రైవర్ చంద్ర అన్నను తోడుగా తీసుకుని, శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దొడ్డాపురం వీధిలో డాక్టర్ బాబు ప్రసాద్ గారి దగ్గరకు వెళ్లాను.
ఆయన పరీక్షించి...
"ప్రాబ్లమ్ ముదిరిపోయింది. సర్జరీ చేయించుకోవాల్సిందే." అని చెప్పారు.
తాత్కాలికంగా నొప్పి తగ్గేందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి, టాబ్లెట్స్ రాశారు.
అలాగే...
"మంచి హాస్పిటల్‌లో వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకో." అని కూడా చెప్పారు.
నాకు ఆపరేషన్ అంటే చిన్నప్పటి నుంచే చాలా భయం.
అందుకే ఇన్నిరోజులు పైల్స్ ఆరోగ్య సమస్యకు ఆయుర్వేద చికిత్సతోనే సరిపెట్టుకుంటూ వచ్చాను.
కానీ...
ఇప్పుడు పరిస్థితి ఆ దశ దాటిపోయిందేమో అనిపిస్తోంది.
ఈరోజు నేను అనుభవించిన నొప్పి...
నిజంగా భరించలేనిది.
జీవితంలో ఇంత అసౌకర్యంగా, ఇంత తీవ్రమైన నొప్పితో గడిపిన రోజులు చాలా అరుదు.
అందుకే...
ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నాను.
పైల్స్‌కు సంబంధించిన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్జరీలు, కొత్త చికిత్సా విధానాలు, మంచి హాస్పిటల్స్ గురించి తెలుసుకుని... వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.
---
పైల్స్‌ను వైద్య పరిభాషలో హెమోరాయిడ్స్ (Hemorrhoids) అని అంటారు.
కొంతమందికి మలద్వారం లోపల (Internal Hemorrhoids), మరికొంతమందికి బయట (External Hemorrhoids) ఈ సమస్య ఏర్పడుతుంది.
ఈ బ్లాగ్ రాయడానికి ప్రధాన కారణం ఒక్కటే...
ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువగా వయస్సు పైబడిన వారిలో కనిపించేది. కానీ నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల నేడు 18 ఏళ్ల యువకుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు... మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారిలోనూ పైల్స్ సమస్య కనిపిస్తోంది.
కాబట్టి...
ఎంత చిన్న ఆరోగ్య సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో సరైన వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
---
ఆరోగ్యం కంటే విలువైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు.
ఆరోగ్యం బాగున్నంత వరకు దాని విలువ మనకు తెలియదు. కానీ ఒకసారి అది దెబ్బతింటే... ప్రతి చిన్న పనికీ, ప్రతి క్షణానికీ ఆరోగ్యం ఎంత గొప్ప వరమో అప్పుడు అర్థమవుతుంది.
— తిరుపతి మహేష్
09-07-2026
Comments
Post a Comment