ఆరు చుక్కలు… కోట్లాది జీవితాలు…...
1997 జూన్ నెల చివరి వారంలో వచ్చిన ఒక శుక్రవారం…
నా తల్లిదండ్రులు నన్ను చెన్నైలో ఉన్న, దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం నడపబడే ఒక ప్రత్యేక పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు.
ఆ స్కూల్ blind students కోసం నడపబడేదిగా ఉండడంతో,
మొదటి తరగతి నుంచే నా విద్యా ప్రయాణం బ్రెయిల్ పద్ధతిలోనే ప్రారంభమైంది.
సాయంత్రం సమయాల్లో volunteers ఎవరో ఒకరు వచ్చి సాధారణ పుస్తకాలు చదివేవారు…
వాళ్లు చదివింది జాగ్రత్తగా విని, నేను బ్రెయిల్‌లో నోట్స్ రాసుకోవడం…
తర్వాత పరీక్షల సమయంలో, నేనే రాసుకున్న ఆ బ్రెయిల్ నోట్స్‌ను తిరిగి చదవడం…
అలా చెన్నైలో నా పాఠశాల జీవితం మొత్తం 12 సంవత్సరాలు గడిచింది.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే —
ఎంత సమయం, ఎంత శ్రమతో కూడుకున్న ఆ బ్రెయిల్ విధానంలో
పన్నెండు సంవత్సరాలు నేను ఎలా చదివానో అనిపిస్తే…
నాకే నమ్మశక్యం కాకుండా ఆశ్చర్యంగా ఉంటుంది.
ఆ రోజుల్లో…
మేము చదువుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం బ్రెయిల్ అన్న నిజాన్ని
మేమెప్పటికీ మర్చిపోలేము.
2009లో నేను తిరుపతిలోని SV Arts కాలేజీలో చేరిన తర్వాత,
బ్రెయిల్ నుంచి కంప్యూటర్‌పై ఆధారపడి చదివే విధానానికి మారాను.
ప్రతి రోజు ఇంటి నుంచి బ్యాంక్, బ్యాంక్ నుంచి ఇంటికి Rapido బైక్‌లో ప్రయాణం చేస్తుంటాను.
అప్పుడు నేను “బ్యాంకులో పని చేస్తున్నాను” అని చెప్పగానే,
కెప్టెన్స్ ముందుగా అడిగే ప్రశ్న:
“మీకు బ్యాంకులో ప్రత్యేక బ్రెయిల్ కీబోర్డ్ ఉందా?”
“లేదు” అని చెప్పగానే…
వెంటనే వచ్చే తదుపరి ప్రశ్న:
“అయితే బ్రెయిల్ లేకుండా మీరు ఎలా పని చేస్తారు?”
చాలామందికి బ్రెయిల్ అనేది
blind persons జీవించడానికి తప్పనిసరి సాధనం అన్న భావన ఉంటుంది.
కానీ నిజం ఏమిటంటే —
బ్రెయిల్ అనేది చదవడానికి, రాయడానికి ఉపయోగించే
ఒక లిపి మాత్రమే.
కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత…
మేము ప్రత్యేకంగా బ్రెయిల్ పరికరాలను ఉపయోగించడం లేదు.
అందరూ ఉపయోగించే సాధారణ కంప్యూటర్లు,
స్మార్ట్‌ఫోన్లనే
కొన్ని సహాయక సాంకేతిక సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో
మా అవసరాలకు అనుగుణంగా మేమూ ఉపయోగించుకుంటున్నాము.
చాలా తరాల పాటు
దృష్టి లోపం ఉన్నవారికి విద్య అందించిన క్రెడిట్
బ్రెయిల్‌కే చెందుతుంది — ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో,
స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో…
దృష్టి లోపం ఉన్న పిల్లలు చిన్న వయసు నుంచే బ్రెయిల్‌పై పూర్తిగా ఆధారపడకుండా
విద్య నేర్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయి.
---
ఈ రోజు — జనవరి 4.
ప్రపంచవ్యాప్తంగా దృష్టి లోపం ఉన్న కోట్లాది మందికి
“విద్య” అనే వెలుగు అందించిన మహానుభావుడు
Louis Braille గారి జన్మదినం.
ఫ్రాన్స్‌కు చెందిన లూయి బ్రెయిల్,
మూడు సంవత్సరాల వయసులోనే తన చూపును కోల్పోయాడు.
పారిస్‌లో ఉన్న దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం నడిచే పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో,
సైన్యంలో ఉపయోగించే “నైట్ రైటింగ్” అనే స్పర్శ ఆధారిత పద్ధతి గురించి ఆయన తెలుసుకున్నాడు.
రాత్రివేళల్లో చూపు ఉపయోగించకుండా సమాచారం చదవడానికి ఉపయోగించే ఆ విధానాన్ని
ఇంకా సులభంగా మార్చి, blind విద్యకు ఉపయోగపడేలా చేయాలని ఆయన ఆలోచించాడు.
అలా — కేవలం ఆరు చుక్కల ఆధారంగా
చదవడానికి, రాయడానికి వీలైన
ఒక సులభమైన కొత్త పద్ధతిని
తన చదువుకునే రోజుల్లోనే అభివృద్ధి చేశాడు.
ఆ పద్ధతే తరువాత ప్రపంచవ్యాప్తంగా
“బ్రెయిల్ లిపి”గా ప్రసిద్ధి చెందింది.
ఆ చిన్న ఆరు చుక్కలు…
దృష్టి లోపం ఉన్న కోట్లాది మంది జీవితాలకు
విద్య అనే వెలుగు తీసుకువచ్చాయి.
బ్రెయిల్ అనేది కేవలం ఒక లిపి మాత్రమే కాదు —
అది ఎన్నో జీవితాలకు వెలుగు నింపిన
ఒక గొప్ప ఆలోచన.
ఈ రోజు, జనవరి 4 — లూయి బ్రెయిల్ గారి జన్మదినం సందర్భంగా,
కోట్లాది జీవితాలను వెలిగించిన ఆయన ఆవిష్కరణకు
మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, వందనాలు.
---
తిరుపతి మహేష్
04/01/2026
Comments
Post a Comment